Abhimanyu Easwaran: సెలక్ట్ చేయకపోవడం బాధగా అనిపించింది.. వారిద్దరూ నాకు స్ఫూర్తి: అభిమన్యు ఈశ్వరన్

Abhimanyu Easwaran: సెలక్ట్ చేయకపోవడం బాధగా అనిపించింది.. వారిద్దరూ నాకు స్ఫూర్తి: అభిమన్యు ఈశ్వరన్

దేశవాళీ క్రికెట్‎లో పరుగుల వరద పారిస్తున్న టాలెంటెడ్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‎కు మరోసారి నిరాశ తప్పలేదు. టీమిండియా తరుఫున టెస్ట్ క్రికెట్‎లో అరంగ్రేటం చేసేందుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఈ బెంగాల్ బ్యాటర్‎కు నిరీక్షణ తప్పేలా లేదు. తుది జట్టులో స్థానం సంగతి పక్కన పెడితే అసలు టీమిండియా స్క్వాడ్ లో అభిమన్యు చోటు దక్కలేదు. గురువారం (సెప్టెంబర్ 25) వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు ఈశ్వరన్ కు స్థానం దక్కకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ స్క్వాడ్ లో చోటు దక్కించుకున్న ఈ బెంగాల్ క్రికెటర్ అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోవడం షాకింగ్ గా మారింది. 

ప్రస్తుతం రంజీ ట్రోఫీకి సిద్ధమవుతున్న ఈశ్వరన్.. విండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు ఎంపికవ్వకపోవడంపై స్పందించాడు. తనకు భాధగా అనిపించినా.. మైకేల్ హస్సీ, సూర్య కుమార్ యాదవ్ తనకు ఆదర్శం అని తెలిపాడు. ఈశ్వరన్ మాట్లాడుతూ.. "సెలక్ట్ కాకపోవడంతో కొన్నిసార్లు బాధ కలుగుతుంది. మనం జట్టులో ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు చోటు దక్కుతుందని ఆశిస్తాం. నా కుటుంబం, స్నేహితులు, కోచ్ నాకు చాల సపోర్ట్ గా ఉండడం నా అదృష్టం. వారు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం నేను మంచి ఫామ్ లో ఉన్నాను. రాబోయే రంజీ సీజన్ కోసం ఎదురు చూస్తున్నాను. 

"నేను మైఖేల్ హస్సీకి పెద్ద అభిమానిని. ఆస్ట్రేలియా అరంగేట్రం చేయడానికి ముందే, అతను దేశీయ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధించాడు. అతని పట్టుదలతో ఏమి సాధించగలిగాడో ప్రపంచానికి చూపించాడు. సూర్య [సూర్యకుమార్ యాదవ్] 30 ఏళ్ల తర్వాత టీంఇండియాలో అరంగేట్రం చేసి భారత జట్టుకు కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇలాంటి ఆటగాళ్లు నాకు గొప్ప ఉదాహరణలు. నేను కూడా వీరిద్దరి లాగే అవుతానేమో చెప్పలేం కదా". అని ఈశ్వరన్ చెప్పుకొచ్చాడు. 

భారత టెస్ట్ జట్టులోకి అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి 2021 స్థానం సంపాదించాడు. ఇంగ్లాండ్‌తో జరిగే స్వదేశీ సిరీస్‌కు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ నాలుగేళ్లలో ఈశ్వరన్ కు టెస్ట్ అరంగేట్రం చేయలేకపోవడం విచారకరం. ఈశ్వరన్ తర్వాత భారత స్క్వాడ్ లోకి ఎంపికైన 15 మంది ఆటగాళ్ళు ఇండియా తరపున టెస్ట్ క్రికెట్ లో తమ తొలి మ్యాచ్ ఆడేశారు. వెస్టిండీస్ తో సిరీస్ కు అసలు ఈశ్వరన్ కు 15 మందిలో ఛాన్స్ కూడా దక్కలేదు.