
దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న టాలెంటెడ్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. టీమిండియా తరుఫున టెస్ట్ క్రికెట్లో అరంగ్రేటం చేసేందుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఈ బెంగాల్ బ్యాటర్‌కు నిరీక్షణ తప్పేలా లేదు. తుది జట్టులో స్థానం సంగతి పక్కన పెడితే అసలు టీమిండియా స్క్వాడ్ లో అభిమన్యు చోటు దక్కలేదు. గురువారం (సెప్టెంబర్ 25) వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు ఈశ్వరన్ కు స్థానం దక్కకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ స్క్వాడ్ లో చోటు దక్కించుకున్న ఈ బెంగాల్ క్రికెటర్ అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోవడం షాకింగ్ గా మారింది.
ఈశ్వరన్ ను వెస్టిండీస్ సిరీస్ కు ఎందుకు చేయలేదో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చాడు. " సహజంగా విదేశీ టూర్ కు వెళ్ళినప్పుడు 16 లేదా 17 మందిని ఎంపిక చేస్తారు. ఏదైనా ప్లేయర్ గాయం కారణంగా దూరమైతే వెంటనే అందుబాటులో ఉండాలి. బ్యాకప్ ఓపెనర్ బదులు అదనపు స్పిన్నర్ ను ఎంచుకోవడం ఉత్తమంగా భావించాం. ఓపెనర్లుగా రాహుల్, జైశ్వాల్ ఉన్నారు. ప్రస్తుతానికి మాకు జట్టులో మూడో ఓపెనర్ తో అవసరం లేదు. ఒకవేళ జట్టుకు అవసరమైతే సిరీస్ మధ్యలో ఈశ్వరన్ ను పిలిపించి అతని సేవలను వాడుకుంటాం". అని అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నాడు.
ALSO READ : వైస్ కెప్టెన్ గా జడేజా.. వెస్టిండీస్ సిరీస్ కు భారత జట్టు ఇదే
భారత టెస్ట్ జట్టులోకి అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి 2021 స్థానం సంపాదించాడు. ఇంగ్లాండ్‌తో జరిగే స్వదేశీ సిరీస్‌కు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ నాలుగేళ్లలో ఈశ్వరన్ కు టెస్ట్ అరంగేట్రం చేయలేకపోవడం విచారకరం. ఈశ్వరన్ తర్వాత భారత స్క్వాడ్ లోకి ఎంపికైన 15 మంది ఆటగాళ్ళు ఇండియా తరపున టెస్ట్ క్రికెట్ లో తమ తొలి మ్యాచ్ ఆడేశారు. వెస్టిండీస్ తో సిరీస్ కు అసలు ఈశ్వరన్ కు 15 మందిలో ఛాన్స్ కూడా దక్కలేదు.
టీమిండియా టెస్ట్ స్క్వాడ్ విషయానికి వస్తే 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ గురువారం (సెప్టెంబర్ 25) ప్రకటించింది. గిల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. రిషబ్ పంత్ దూరం కావడంతో వైస్ కెప్టెన్సీ పగ్గాలు జడేజాకు అప్పగించారు. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత సాయి సుదర్శన్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ స్క్వాడ్ లో చోటు సంపాదించాడు. ఇంగ్లాండ్ లో పేలవంగా ఆడిన ట్రిపుల్ సెంచరీ వీరుడు కరుణ్ నాయర్‌పై సెలక్టర్లు వేటు వేశారు. టీమిండియా టెస్ట్ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కు కూడా పట్టించుకోలేదు.
వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు టీమిండియా స్క్వాడ్:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్ ), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్.జగదీషన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్