పరువు తీశారు..! బాలీవుడ్ ప్రొడ్యూసర్ల అత్యుత్సాహం

పరువు తీశారు..! బాలీవుడ్ ప్రొడ్యూసర్ల అత్యుత్సాహం

దేశ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతున్న ఈ సమయంలో.. కొందరు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు తమ సినిమాలకు తగిన టైటిళ్లవేటలో పడ్డారు. ఫిబ్రవరి 14న పుల్వామా ఎటాక్ నుంచి.. ఫిబ్రవరి 28న అభినందన్ విడుదల ప్రకటన వరకు…  ఈ సంఘటనలను బేస్ చేసుకుని… పశ్చిమ ముంబై లోని అంధేరి – ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో టైటిళ్ల రిజిస్ట్రేషన్ జోరుగా జరిగింది. బాలీవుడ్ లోని బడా సంస్థల ప్రతినిధులు టైటిల్స్ ను రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలోనూ.. ఏయే టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయో తెల్సుకుని ఆల్టర్ నేటివ్ టైటిల్ ను నమోదు చేయించడంలో ఈ వారం పది రోజులు బిజీగా గడిపారని ముంబై ట్రేడ్ మేగజీన్స్ తెలిపాయి.

గడిచిన రెండువారాలుగా నమోదైన టైటిల్స్ డేటాను IMMPA ప్రకటించింది. ఇందులో పుల్వామా – ద డెడ్లీయెస్ట్ ఎటాక్, పుల్వామా ఎటాక్- సర్జికల్ స్ట్రైక్ 2.0, బాలాకోట్, ఎయిర్ ఫోర్స్ పైలట్ – అభినందన్, వార్ రూమ్,  హిందూస్థాన్ హమారా హై, ది ఎటాక్స్ ఆఫ్ పుల్వామా లాంటి టైటిల్స్ ఎన్నో రిజిస్టర్ అయ్యాయి.

ఉరి- ద సర్జికల్ స్ట్రైక్ సినిమా ఇటీవలే విడుదలై రూ.250 కోట్లు వసూలు చేసింది. పేట్రియాటిక్ కథలు కూడా బాగానే వసూలు చేస్తాయన్న అభిప్రాయం నిర్మాతల్లో బలంగా ఏర్పడింది. అందుకే నిర్మాతల మధ్య టైటిళ్ల పోటీ పెరిగింది. ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫీస్ లో రోజంతా నిర్మాతల ప్రతినిధుల హడావుడి ఎక్కువైంది.

ఐతే… కొందరు బాలీవుడ్ నిర్మాతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్రిక్తత, భావోద్వేగం కొనసాగుతున్న ఈ సమయంలో.. బిజినెస్ ఆలోచనలు అవసరమా అనే సెటైర్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇండియా సినిమా ప్రొడ్యూసర్లు ఇంత నీచంగా ఆలోచిస్తారా అనే కొందరు జర్నలిస్టులు, రచయితలు తమ అసంతృప్తిని బయటపెట్టారు.