IND vs AUS: జైశ్వాల్‌కు మరోసారి అన్యాయం చేస్తున్నారా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీ20 స్టార్ ఓపెనర్

IND vs AUS: జైశ్వాల్‌కు మరోసారి అన్యాయం చేస్తున్నారా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీ20 స్టార్ ఓపెనర్

అక్టోబర్ 19 ఉంచి ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కు టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంపిక కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు టీ20ల్లో ధనాధన్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్న అభిషేక్ ఇకపై వన్డే క్రికెట్ లోకి రానున్నట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ టాప్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్న ఈ పంజాబ్ హిట్టర్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అతని బ్యాటింగ్ నైపుణ్యం వన్డేలకు కూడా సరిపోతుందని గంభీర్ భావిస్తున్నాడట. స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడం అభిషేక్ శర్మకు కలిసి రానుంది. 

అభిషేక్ శర్మ ఒక్కసారిగా ఓపెనర్ రేస్ లోకి రావడంతో జైశ్వాల్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్ కు బ్యాకప్ ఓపెనర్ గా నిన్నటివరకు జైశ్వాల్ ఎంపిక ఖాయమనుకున్నా ఇప్పుడు అది జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఆసియా కప్ లో చోటు దక్కించుకోలేని జైశ్వాల్.. వన్డేల్లోనూ పక్కన పెట్టి అన్యాయం చేస్తారా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు జైశ్వాల్ ఒకటే వన్డే మ్యాచ్ ఆడాడు. 2027 వన్డే వరల్డ్ కప్ కు ముందు జైశ్వాల్ వన్డేల్లో ఎక్కువ ఛాన్స్ లు ఇస్తే 50 ఓవర్ల ఫార్మాట్ లో అతని టాలెంట్ పై కూడా ఒక క్లారిటీ వస్తోంది. గిల్, రోహిత్ శర్మ రెగ్యులర్ ఓపెనర్లుగా కొనసాగనున్నారు.

జైశ్వాల్ లేదా అభిషేక్ శర్మలలో ఒకరు బ్యాకప్ ఓపెనర్ గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జరుగుతన్న ఆసియా కప్ లో జైశ్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో  208.43 స్ట్రైక్ రేట్‌తో 173 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. పొట్టి ఫార్మాట్ లో అభిషేక్ 8.09 ఎకానమీ రేటుతో ఆరు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ లిస్ట్ ఎ రికార్డు కూడా ఆకట్టుకుంటుంది. 61 మ్యాచ్‌ల్లో 35.33 యావరేజ్ తో 2014 పరుగులు చేశాడు. తన బౌలింగ్ తో   38 వికెట్లు కూడా పడగొట్టాడు. అభిషేక్ ఇటీవలే నెట్స్‌లో గంటల తరబడి బౌలింగ్ చేస్తూ కనిపించాడు. 

►ALSO READ | IND vs BAN: టాస్ ఓడి బ్యాటింగ్ చేయనున్న ఇండియా.. నాలుగు మార్పులతో బంగ్లాదేశ్

2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.