Abhishek Sharma: భారత యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన వ్యక్తిగత హక్కుల (Personality Rights) రక్షణ కోసం లీగల్ పోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, చివరకు తన రూపాన్ని ఏఐ (AI-generated) టెక్నాలజీతో మార్చేసి వాడుకుంటున్నారంటూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
అది మామూలు ఫొటో కాదు.. ఏఐతో మార్చేశారు:
అభిషేక్ శర్మ తరఫు లాయర్ కోర్టులో తమ వాదనలు గట్టిగానే వినిపించారు. మెటా (Meta) కంపెనీ తరఫు లాయర్ స్పందిస్తూ.. అభిషేక్ శర్మ సమర్పించిన లింకులలో రెండు ఇప్పటికే పని చేయడం లేదని చెప్పారు. మిగిలిన వాటిలో ఒకటి చూస్తే సాధారణ పాపరాజీ (సెలెబ్రిటీల ఫొటోలు తీసేవాళ్లు) పోస్ట్ లాగే ఉందని, అందులో హక్కుల ఉల్లంఘన ఏమీ లేదని వాదించారు. మెటా వాదనను అభిషేక్ శర్మ లాయర్ పూర్తిగా ఖండించారు. అభిషేక్ తన మేనేజర్‌తో ఉన్న ఒక ఒరిజినల్ ఫొటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి పూర్తిగా మార్చేశారని కోర్టుకు వివరించారు. రూపంతో పాటు ఆ ఫొటో ఉన్న సందర్భాన్ని (Context) కూడా మార్చేసి జనాన్ని తప్పుదోవ పట్టించేలా క్రియేట్ చేశారని వాదించారు. దీనివల్ల క్రికెటర్ వ్యక్తిత్వానికి నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
4,000 లింకులా?.. మెటా అభ్యంతరం:
ఇక మెటా కంపెనీ లాయర్ కోర్టులో తమ ప్రాక్టికల్ ఇబ్బందులను చెప్పుకొచ్చారు. మొదట అభిషేక్ శర్మ కోర్టుకు వచ్చినప్పుడు కేవలం 25 వెబ్ లింకులు (URLs) మాత్రమే ఇచ్చారని, కానీ ఆ తర్వాత ఆ సంఖ్య ఏకంగా 4,000 లింకులకు చేరిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడు. ఇలా లింకులు పెరుగుతూ పోతే ఐటీ కంపెనీలకు వాటిని కంట్రోల్ చేయడం కష్టమవుతుందన్నారు. అభిషేక్ శర్మను విమర్శించే ప్రతి కంటెంట్‌ను తొలగించి, ఇంటర్నెట్ మొత్తాన్ని క్లీన్ చేయాలి అన్నట్లుగా ఈ డిమాండ్ ఉందని, అది సాధ్యం కాదని మెటా తరపు లాయర్ పేర్కొన్నాడు. ఎవరైనా తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తే పరువు నష్టం కిందికి వస్తాయి తప్ప, పర్సనాలిటీ రైట్స్ కిందికి రావని తెలిపాడు.
జూలై 9కి విచారణ వాయిదా:
రెండు వైపుల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు జస్టిస్ జ్యోతి సింగ్.. ఆన్‌లైన్ కంటెంట్‌లో పరువు నష్టానికి, వ్యక్తిగత హక్కులకు మధ్య చాలా సన్నని గీత మాత్రమే ఉందని, రోజువారీ కోర్టులో ఇలాంటివి చూస్తూనే ఉన్నామని అన్నారు. పిటిషన్‌లో కొన్ని సాంకేతిక అంశాలను పరిశీలించాల్సి ఉందంటూ ఈ విచారణను జూలై 9కి వాయిదా వేశారు. కాగా ఈ మధ్య కాలంలో ఏఐ పుణ్యమా అని డీప్‌ఫేక్స్, మార్చేసిన వీడియోలతో సెలెబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తమ పర్మిషన్ లేకుండా ఫొటోలను కమర్షియల్‌గా వాడుకోవడంపై రక్షణ కల్పించాలని కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది.
