
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ పారా అథ్లెట్ ప్రమోద్ భగత్.. అబియా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో ట్రిపుల్ గోల్డ్ మెడల్స్ సాధించాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్–3 ఫైనల్లో ప్రమోద్ 21–7, 9–21, 21–9తో సహచరుడు మంటు కుమార్‌పై గెలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో రెండో సెట్‌ను కోల్పోయిన ప్రమోద్ ఎక్కడా తడబడలేదు. తన ట్రేడ్ మార్క్ ఆటతీరుతో వ్యూహాత్మకంగా పాయింట్లు రాబట్టాడు. మెన్స్ డబుల్స్ ఫైనల్లో ప్రమోద్–సుకాంత్ కడమ్ 21–13, 21–17తో గెర్సన్ జైర్ వెర్గాస్ లాస్టౌనాల్–డయానా రోజాస్ గోలాక్ (పెరూ)ను ఓడించి రెండో గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు.
మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌ఎల్3–ఎస్‌యూ5 ఫైనల్లోనూ ప్రమోద్–ఆరతి పాటిల్.. తమ ప్రత్యర్థులపై గెలిచి బంగారు పతకాన్ని సాధించారు. ఓవరాల్‌గా మూడు మ్యాచ్‌ల్లోనూ తన ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ప్రమోద్.. పారా షట్లర్‌గా తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు. ‘ప్రతి విజయం నా పరిమితులను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నన్ను ప్రేరేపిస్తుంది. ఈ స్థాయిలో పోటీపడటంతో పాటు ఇండియాకు కీర్తిని తీసుకు రావడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమైందే. నాకు మద్దతుగా నిలిచిన టీమ్‌కు వాళ్ల కృషి పట్ల నేను గర్వపడుతున్నా’ అని ప్రమోద్ పేర్కొన్నాడు.
ప్రమోద్‌తో కలిసి ఆడటం ఎల్లప్పుడూ తన ఉత్తమ ఆటతీరును చూపెట్టడానికి దోహదం చేస్తుందని సుకాంత్ వ్యాఖ్యానించాడు. మెన్స్ సింగిల్స్ డబ్ల్యూహెచ్1లో బ్రాంజ్ మెడల్ సాధించిన రంజిత్ సింగ్.. మెన్స్ డబుల్స్ డబ్ల్యూహెచ్1–డబ్ల్యూహెచ్2లో పరమ్‌జిత్ సింగ్‌తో, మిక్స్‌డ్ డబుల్స్ డబ్ల్యూహెచ్1–డబ్ల్యూహెచ్2లో షబానాతో కలిసి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాడు. మెన్స్ సింగిల్స్ (డబ్ల్యూహెచ్2)లో నురుల్ హుస్సేన్ ఖాన్, విమెన్స్ సింగిల్స్ (ఎస్‌ఎల్3)లో ఉమా సర్కార్ సిల్వర్ మెడల్స్‌ను గెలిచారు. విమెన్స్ డబుల్స్‌లో ఉమా సర్కార్–ఆరతి జోడీ బ్రాంజ్ మెడల్‌ను సాధించింది. మెన్స్ సింగిల్స్ ( ఎస్‌ఎల్–4)లో నీలేశ్ గైక్వాడ్, విమెన్స్ సింగిల్స్ (ఎస్‌ఎల్–4)లో కనక్ సింగ్ జదౌన్ బ్రాంజ్ మెడల్స్‌ను గెలిచారు. ఇక ఎస్‌యూ–5 మెన్స్ సింగిల్స్‌లో కరన్ పనీర్, రాహుల్ విమల్, సతివాడ వరుసగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను కైవసం చేసుకున్నారు.