అలుపెరుగని అక్షరాయుధుడు ఆవిష్కరణ

అలుపెరుగని అక్షరాయుధుడు ఆవిష్కరణ

ఖైరతాబాద్, వెలుగు : సీనియర్ జర్నలిస్ట్​ఏబీకే ప్రసాద్ వృత్తిపట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సలహాదారు సంజయ్​బారు పేర్కొన్నారు. జీవితాంతం జర్నలిజంను నమ్ముకుని ఎందరినో ఉత్తమ జర్నలిస్టులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఏబీకే ప్రసాద్​90వ పుట్టినరోజు సందర్భంగా గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఏబీకే ప్రసాద్​జీవన సాఫల్య అభినందన సభ నిర్వహించారు. వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో ‘అలుపెరుగని అక్షరాయుధుడు’ అనే పుస్తకం ఆవిష్కరించారు.

అనంతరం తెలంగాణ ప్రెస్​అకాడమీ చైర్మన్​ శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ.. ఏ కొత్త పత్రిక వచ్చినా అది ఏబీకే సారథ్యంలోనే విడుదలైందని తెలిపారు. ఆయనకు శిష్యుడిగా తనకు చాన్స్ రాలేదని చెప్పారు. తనకు ఏబీకే ప్రసాద్​మంచి బ్రేక్​ ఇచ్చారని, సీనియర్ జర్నలిస్ట్​కె.రామచంద్రమూర్తి గుర్తుచేశారు. జర్నలిజానికి స్టార్​డమ్​ తెచ్చింది ఏబీకే ప్రసాద్​అని ఆంధ్రజ్యోతి ఎడిటర్​కె.శ్రీనివాస్​పేర్కొన్నారు.

తెలుగును అధికార భాషగా ప్రకటించడంలో సంజయ్​బారు పాత్ర గొప్పదని ఏబీకే ప్రసాద్ అన్నారు. దాసు కేశవరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్, జర్నలిస్టులు పాల్గొన్నారు.