
- స్టేషనరీ కోసం అడుక్కోవాల్నా?
- మాజీ జడ్జీలకు మీరిచ్చే గౌరవమిదేనా?.. కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్‌లోని చైర్పర్సన్లకు, సభ్యులకు కనీస సౌలతులు కూడా కల్పించనప్పుడు ఆ ట్రిబ్యున్సల్ ఎందుకని, వాటిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చివరికి స్టేషనరీ కోసం కూడా కేంద్రాన్ని వాళ్లు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ట్రిబ్యునల్స్‌లో చైర్పర్సన్లుగా ఉండే మాజీ జడ్జీలకు మీరిచ్చే గౌరవం, మర్యాద ఇదేనా? అని నిలదీసింది. వివిధ ట్రిబ్యునల్స్‌లో ఖాళీలపై ఎన్‌జీటీ బార్ అసోసియేషన్ (వెస్టర్న్ జోన్) దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ బి.వి.నాగరత్న, జిస్టిస్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా కేంద్రం తీరుపై బెంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్‌లు, సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు ట్రిబ్యునళ్లలో చైర్పర్సన్లుగా నియమితులైనప్పుడు.. వారికి అకామిడేషన్, వాహనం, స్టేషనరీ వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటం లేదు. కేంద్రం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేసిందే కేంద్ర ప్రభుత్వం కదా? మరెందుకు నిధులు కేటాయించడం లేదు. ఎందుకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించడం లేదు?” అని ప్రశ్నించింది.
కమిటీని వేయండి
ట్రిబ్యునల్స్‌లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఆ పదవులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటీవల కొందరు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత తప్పుకున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని తెలిపింది. ‘‘ఈ మధ్య ఇద్దరు రిటైర్డ్ జడ్జీలు ట్రిబ్యునల్స్ చైర్పర్సన్లుగా వచ్చిన ఆఫర్లను తిరస్కరించారు. వాళ్లు అలా తిరస్కరించడం సరికాదు.. కానీ, ఎందుకు తిరస్కరించారో కేంద్రం ఆలోచించాలి.
ట్రిబ్యునల్స్‌లో సరైన సౌలతులు లేకనే ఎవరూ అక్కడ పనిచేసేందుకు ముందుకు రావడం లేదనే విషయం గుర్తుంచుకోవాలి” అని పేర్కొంది. ‘‘ఇంటి కోసం, వెహికల్ కోసం, చివరికి ఆఫీసులో పెన్నుల కోసం కూడా వాళ్లు అడుక్కోవాల్నా? డొక్కు కార్లను ట్రిబ్యునల్స్ చైర్పర్సన్లకు ఇస్తారా? ఇదా మీరు మాజీ జడ్జీల విషయంలో చూపే గౌరవం? ఒక్కసారి వాస్తవంలోకి వెళ్లి చూడండి. పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.
సౌకర్యాలు కల్పించనప్పుడు ట్రిబ్యునల్స్ను రద్దు చేసేయండి” అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ట్రిబ్యునల్స్‌లోని సమస్యలపై అధ్యయనానికి, వాటి పరిష్కారానికి వివిధ మంత్రిత్వ శాఖలు, డీవోపీటీతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కేందాన్ని ఆదేశించింది. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని అడిషనల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్ జిత్ బెనర్జీ తెలిపారు. విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 16కు వాయిదా వేసింది.