కొత్త మున్సిపాలిటీలతో ఉపాధిహామీ పథకం రద్దు

కొత్త మున్సిపాలిటీలతో ఉపాధిహామీ పథకం రద్దు

మంచిర్యాల, వెలుగు: రాష్ర్టంలోని మున్సిపాలిటీల్లో పట్టణ పేదలు 'ఉపాధి' లేక అల్లాడుతున్నారు. నాలుగేండ్ల కింద ఏర్పాటైన కొత్త మున్సిపాలిటీల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.  2018 ఆగస్టులో ప్రభుత్వం 59 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. తర్వాతి ఏడాది మరో 13 పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చింది.  మేజర్​ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తూ సమీప గ్రామపంచాయతీలను అందులో విలీనం చేసింది. ఆ తర్వాత కొత్త మున్సిపాలిటీల్లో ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసింది. దీంతో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేక రాష్ర్టవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది పట్టణ పేదలు దినదినగండంగా బతుకుతున్నారు.

కనిపించని అర్బనైజేషన్

కార్పొరేషన్లు, పెద్ద మున్సిపాలిటీల్లో మినహా కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాల్లో నేటికీ అర్బనైజేషన్​ కనిపించడం లేదు. గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలుగా మారితే అభివృద్ధి జరుగుతుందన్నది భ్రమగానే మిగిలింది. ఈ మున్సిపాలిటీల్లో కొత్తగా పరిశ్రమలు రాలేదు.  ఎంప్లాయ్​మెంట్ పెరగలేదు. మెజారిటీ ప్రజలు ఎప్పటిలాగే వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఇటీవల కాలంలో పంటల సాగులో మెకనైజేషన్​ పెరిగింది. దుక్కి దున్నడం మొదలు కోతల వరకూ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర మెషీన్లు రావడంతో కూలీలకు ఎవుసం పనులూ కరువయ్యాయి. ఉపాధి కోసం దగ్గరలోని పెద్ద పట్టణాలకు వలసపోతున్నారు. మరోవైపు కొత్త మున్సిపాలిటీల్లో భూముల ధరలు అమాంతం పెరిగాయి. పేదలు గుంట జాగ కూడా కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు పన్నుల భారం విపరీతంగా పెరగడంతో పరేషాన్​

 అవుతున్నారు. 

10 లక్షల మంది 'ఉపాధి'కి దూరం

గ్రామపంచాయతీలుగా ఉన్నప్పుడు ఉపాధిహామీ పనులు ముమ్మరంగా సాగాయి. రైతులు, కూలీలు ఎవుసం పనులు పూర్తి కాగానే ఉపాధిహామీ పనులకు వెళ్లేవారు. దీనిద్వారా పేదలు వంద రోజుల పనితో పొట్టపోసుకునేవారు. మంచిర్యాల జిల్లాలో గతంలో మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలు ఉండేవి. ప్రభుత్వం లక్సెట్టిపేట, నస్పూర్​, క్యాతన్​పల్లి, చెన్నూర్​లను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. చెన్నూర్​ గ్రామ పంచాయతీలో 3,500 జాబ్​కార్డులుండేవి. ఒక్కో కార్డుపై ఇద్దరు, ముగ్గురు కూలీలకు 'ఉపాధి' దొరికింది. ఇప్పుడు వాళ్లకు చేద్దామంటే పనిలేక దిక్కులు చూస్తున్నారు. లక్సెట్టిపేట మేజర్​ గ్రామపంచాయతీకి సమీపంలో ఉన్న ఉత్కూర్​, మోదెల, ఇటిక్యాల పంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీగా మార్చారు. అంతకుముందు లక్సెట్టిపేటలో 723, ఉత్కూర్​లో 681, మోదెలలో 292, ఇటిక్యాలలో 729 జాబ్​ కార్డులు ఉండేవి. ఇలా రాష్ర్టవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది 'ఉపాధి'కి దూరమైనట్టు అంచనా.  

పని లేకుంటే పూట గడవడమే కష్టం.. 

ఇటీవల కాలంలో చాలామంది పేదలు పెద్ద పట్టణాలు, నగరాలకు వలసపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా, అడ్డా కూలీలుగా, హోటళ్లలో వర్కర్లుగా, ఇండ్లలో పనులు చేస్తున్నారు. ఏ పనిచేసినా రోజుకు రూ.300 నుంచి రూ.500లకు మించి దొరకడం లేదు. ఈ చాలీచాలని సంపాదనతో పట్టణాల్లో రోజు గడవమే కష్టమవుతోందని చెప్తున్నారు. అంతేగాకుండా రోజురోజుకూ పట్టణాలపై వలసల ఒత్తిడి పెరగడంతో  అక్కడ కూడా పనులు దొరకడం లేదు. ఒక్క రోజు పని లేకున్నా పూట గడవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. అంతకుముందు ఉన్న ఊరిలోనే ఉపాధి పనికి పోతే రోజుకు రూ.200 వచ్చేది. ఖాళీ టైమ్​లో స్థానికంగా దొరికే పనులు
 చేసుకునేవారు. 

ఆ రాష్ట్రాల్లో మాదిరిగా  అమలు చేయాలె

కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్​ప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల పరిధిలో ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇదేవిధంగా తెలంగాణలోనూ అమలు చేయాలని పట్టణ పేదలు కోరుతున్నారు. ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ అసంఘటిత కూలీ బిడ్డల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు. జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి పట్టణ పేదలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ గోడు చెప్పుకున్నారు. మున్సిపాలిటీల్లో ఉపాధిహామీ పథకం లేకపోవడం, ఇతర పనులు దొరక్కపోవడంతో రోజు గడవని పరిస్థితి నెలకొందని వాపోయారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మేదరి దేవవరం, కార్యదర్శులు కేతిరెడ్డి రమణారెడ్డి, లింగంపెల్లి భానుచందర్​ పాల్గొన్నారు.