ట్విట్టర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు

ట్విట్టర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు


ట్విటర్ సీఈవో ఎలోన్ మస్క్ ఉద్యోగులకు మరో షాకిచ్చారు. ట్విట్టర్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులకు లేఖ రాశారు. కరోనా సమయంలో ట్విట్టర్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేశారని ఎలోన్ మస్క్ అన్నారు. అయితే ఇకపై ఈ విధానానికి స్వస్తి పలకాలన్నారు. ఉద్యోగులు కనీసం వారానికి 40 గంటల పాటు ఆఫీసులో తప్పనిసరిగా పనిచేయాలని ఆదేశించారు. 

ట్విట్టర్ సంస్థను మరింత అభివృద్ధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎలోన్ మస్క్ అన్నారు. అందుకే ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరికైనా ఆఫీసులకు వచ్చేందుకు ఇబ్బందిగా అనిపిస్తే రాజీనామా చేయవచ్చని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ సహ ఉద్యోగులు ఉన్న దగ్గర నివసించాలన్నారు. టెస్లా, స్పెస్ ఎక్స్ సంస్థల్లో ఇలాంటి విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. కఠిన నిబంధల అమలు చేస్తున్నందు వల్లే ఈ రెండు సంస్థలు నెంబర్ వన్ గా ఉన్నాయని చెప్పారు. లేదంటే ఎప్పుడో దివాళా తీసి ఉండేవని తెలిపారు.