ఆదివాసీలకు గూడెంలోనే ఇండ్లు కట్టివ్వాలి : పౌర హక్కుల సంఘం

ఆదివాసీలకు గూడెంలోనే ఇండ్లు కట్టివ్వాలి : పౌర హక్కుల సంఘం

కొలాంగొందిగూడా వాసులకు పౌర హక్కుల సంఘం నేతలు పరామర్శ

కాగజ్​నగర్, వెలుగు: మానవతా విలువలతో ఆదివాసీల, గిరిజనుల పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం పేర్కొంది. హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితి, అభిప్రాయాలను తెలుసుకునేందుకు మంగళవారం రాష్ట్ర పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామి వేంపల్లి టింబర్ డిపోలో చెట్టు నీడన ఉన్న కొలాంగొంది గూడ ఆదివాసీలను పలకరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తాము వేసిన హౌజ్​మోషన్​ పిటిషన్‌‌‌‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించి గిరిజనులతో ప్రత్యక్షంగా మాట్లాడటం మంచి పరిణామం. అయితే వారికి పాత చోటులోనే ఆశ్రయం కల్పించేందుకు ఒప్పుకోకపోవడంతో వారికి న్యాయం జరుగుతుందా లేదా అనే సందేహం నెలకొందన్నారు.

అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీల నివాసాలను అటవీ అధికారులు కూల్చివేశారనే విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పర్యావరణం, అడవులు, వన్యమృగాలకు వీరు నష్టం చేస్తున్నారన్న అటవీశాఖ అధికారులు వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వారు ఇన్నాళ్లు ఉన్న చోటే ఉండేందుకు అనుకూలంగా ఏలాంటి ఆదేశాలు వెలువరించలేదన్నారు. నిరాశ్రయులైన 16 కుటుంబాలకు చెందిన ప్రజలకు సాగు భూమి అందిస్తూ ప్రస్తుతం వాంకిడిలోని ప్రభుత్వ బీసీ హాస్టళ్లలో పునరావాసం కల్పించిందని దీని వల్ల గిరిజనులకు న్యాయం జరగడంపై సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అటవీశాఖను అడ్డుపెట్టుకొని ఆదివాసీలను ఖాళీ చేయిస్తోందని ఆరోపించారు. వారి వెంట తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలండి మధుకర్​, తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా కన్వీనర్​ కుడ్మెత శ్రీనివాస్​ ఉన్నారు.

చెట్ల కింద జంతువులుగా బతుకుతున్నరు

    మానవహక్కుల వేదిక ధ్వజం

తరాలుగా అడవిలో నివాసం ఉంటున్న కొలాంగొంది గూడ వాసుల పట్ల ప్రభుత్వం, అటవీ శాఖ నిర్దయగా వ్యవహరించాయని దీంతో వారు నిలువనీడ కోల్పోయిన చెట్ల కింద జంతువుల్లా బతుకుతుండడం బాధాకరమని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆత్రం భుజంగరావు అన్నారు. మంగళవారం వేంపల్లి టింబర్​డిపోలో ఆదివాసీ గిరిజన కుటుంబాలను ఆయన పరామర్శించి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వారి ఇండ్లు కూల్చివేసిన చెట్ల కింద ఉంచడం మానవహక్కుల ఉల్లంఘనే అన్నారు. ప్రభుత్వం ఆదివాసీలను జంతువులను చూసినట్లు చూస్తోందని అర్థమవుతోందని ఆరోపించారు. వారికి తక్షణమే మెరుగైన టపునరావాసంతో పాటు పాత చోటలోనే నివాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనతో పాటు ఆదివాసీ జేఏసీ జిల్లా నాయకులు  తదితరులు ఉన్నారు.