
ముగ్గురి మృతితో గ్రామస్తుల భయాందోళన
మెదక్/చేగుంట, వెలుగు : మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో ఆరు రోజుల క్రితం ఒక్కసారిగా దాదాపు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన జరిగి ఆరు రోజులైనా పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి కారణం ఏమిటనేది అధికారులు గుర్తించలేకపోయారు. దీపావళి మరుసటి రోజైన 25న పెద్ద శివనూర్ గ్రామంలో ఒకరి వెంట ఒకరుగా దాదాపు 50 మంది వరుసగా విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో తీవ్ర అస్వస్థతకు గురైన కొందరిని తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు.
మరికొందరు తూప్రాన్, చేగుంటలోని ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లారు. హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరుసటిరోజు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. బాధితులకు చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని తూప్రాన్ సీహెచ్ సీకి, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం నల్ల పోచయ్య(90) అనే వ్యక్తి మృతిచెందగా, శనివారం రాత్రి సిద్దిపేట ఆసుపత్రిలో వడ్యారం మల్లమ్మ (74), ఆదివారం సాయంత్రం బండారు లక్ష్మీ(70) చనిపోయారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతిచెందడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యానికి గురైన మరికొందరు తూప్రాన్ , హైదరాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ లోని నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఏడేండ్ల బాలుడు, మేడ్చల్ లో చికిత్స పొందుతున్న పోచమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మిషన్ భగీరథ అధికారులు గ్రామంలో నల్లా నీటి నమూనాలు పరీక్షించి ఎలాంటి లోపం లేదని తేల్చారు. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కల్లు శాంపిల్స్ పరీక్షించి ఎలాంటి లోపం లేదని చెప్పారు. అస్వస్థతకు గురైన వారందరూ గ్రామంలోని ఒకే కాలనీకి చెందినవారు కావడంతో దీపావళి పండగ మరుసటి రోజు తిన్న మటన్, చికెన్ లో ఏదైనా లోపం ఉందా? లేదా కల్లు తాగడం వల్ల అస్వస్థతకు గురై ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.