సమ్మక్క–సారలమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర

సమ్మక్క–సారలమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర

దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉంది. 12వ శతాబ్దంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క. ఆమెను తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. అక్కడి కోయ రాజు పగిడిద్ద రాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు వల్ల కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో ఓరుగల్లు రాజ్యానికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోయడం, రాజ్యాధికారాన్ని ధిక్కరించడం వంటి కారణంతో పగిడిద్దరాజుపై ప్రతాపరుద్రుడు ఆగ్రహిస్తాడు. పగిడిద్దరాజును అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సలహాపై మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు.

సాంప్రదాయ ఆయుధాలైన విల్లంబులు, బరిసెలతో పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. సుశిక్షితులైన కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి అది ‘జంపన్న వాగు’గా ప్రసిద్ధి చెందింది.

ఇక, సమ్మక్క కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, ఆ గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్యపోతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క… రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ, ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

బుధవారాల్లోనే ముఖ్య వేడుకలు

మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరలో బుధవారాలు చాలా పవిత్రమైనవి.  ఆలయాలను, ఇళ్లను శుద్ధి చేసుకునే గుడి మెలిగె, మండ మెలిగె పండుగల్నికూడా బుధవారాల్లోనే నిర్వహిస్తారు. ఆలయంలో కోయ పూజారులు దీపం వెలిగించడంతో  అంకురార్పణ జరిపి, ఆ రోజు నుంచి నాలుగు బుధవారాలపాటు మేడారం జాతర నిర్వహిస్తారు. ముఖ్యమైన ఘట్టం అమ్మవార్లు మేడారం రావడం. దీనినికూడా మూడో బుధవారం పూజారులు జరుపుతారు. పూజారులు వెలిగించిన అఖండ జ్యోతి మళ్లీ రెండేళ్ల వరకు అలాగే ఉంటుందని జనం విశ్వసిస్తారు. నాలుగు బుధవారం (ఫిబ్రవరి 12) తిరుగువారంతో జాతర సందడి ముగుస్తుంది. మాఘ శుద్ధ పౌర్ణమి గడియలను బట్టి పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తేదీలను ప్రకటిస్తారు.

జాతర విశేషాలు

జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆ సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలు ఇద్దరినీ తిరిగి యధాస్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లుగా వ్యవహరిస్తారు. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజనులేకాక అనేక వర్గాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు.

పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్​గఢ్​, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తరలి వచ్చి అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతరను 1940 వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు కాలక్రమేణా జాతర ప్రసిద్ధి గాంచి తెలంగాణ ప్రజలంతా వస్తున్నారు . 1996 లో ఈ జాతరను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పండుగగా గుర్తించింది. సుమారు కోటికి పైగా జనం పాల్గొనే జాతర ఆసియాలోనే అతి గుర్తింపు పొందింది.

జాతర తేదీలు

ఫిబ్రవరి 5న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి గోవిందరాజుల రాక
6న సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాక
7న అమ్మవార్లతో పాటు పగిడిద్ద రాజు, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.
8న తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.
12న చివరి బుధవారంనాడు తిరుగువారం నిర్వహిస్తారు.

మరిన్ని వార్తల కోసం..