ఐపీఎల్‌ బ్యూటీ అంటే అదే..

ఐపీఎల్‌ బ్యూటీ అంటే అదే..

న్యూఢిల్లీప్రపంచ వ్యాప్తంగా ఎన్ని టీ20 లీగ్‌‌లు వచ్చినా.. ఐపీఎల్‌‌ సక్సెస్‌‌ను అడ్డుకోలేకపోయాయి. వరల్డ్‌‌వైడ్‌‌గా స్టార్‌‌ ప్లేయర్లందరూ ఈ లీగ్‌‌లో ఆడాలని ఆరాటపడుతుంటారు. ఇక అన్నింటికంటే ఫైనాన్షియల్‌‌గా బీసీసీఐని ఓ రేంజ్‌‌లోకి తీసుకుపోయిన మెగా ఈవెంట్‌‌. ఇదంతా నాణేనికి ఒక వైపు. మరి రెండో వైపు..? వేర్వేరు దేశాలకు చెందిన క్రికెటర్ల మధ్య స్నేహభావాన్ని పెంచుతూ.. అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్‌‌ చేస్తోంది. ప్రాంతాల వారీగా అభిమానులు వేరుపడినా.. దేశాల వారీగా ఏకం చేస్తోంది. అపోజిషన్‌‌ ప్లేయర్లను కూడా గౌరవించే స్థాయిని తీసుకొచ్చింది. ఐపీఎల్‌‌లో ఉండే బ్యూటీ అంటే ఇదే. అందుకే ఐపీఎల్‌‌ అంటే తనకు ఎనలేని ప్రేమ అని రాయల్‌‌ చాలెంజర్స్‌‌ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ అన్నాడు. ఓ కొత్త వాతావరణంలో క్రికెట్‌‌ ఆడటాన్ని లీగ్‌‌ నేర్పిందన్నాడు.

‘ రకరకాల టోర్నమెంట్లు ఆడతాం. ఒక టీమ్‌‌ మరోదానితో పోటీ పడుతుంది. ఐసీసీ టోర్నీలు కూడా అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. ఆ టైమ్‌‌లో అపోజిషన్‌‌ జట్ల ప్లేయర్లతో మనకు పెద్ద ఇంటరాక్షన్‌‌ ఉండదు. మ్యాచ్‌‌ తర్వాత కూడా పెద్దగా కలవం. కానీ ఐపీఎల్‌‌లో అలా కాదు. వేరే టీమ్‌‌లను రెండు, మూడు రోజులకు ఒకసారైనా కలుస్తాం. ఐపీఎల్‌‌లో బ్యూటీ అంటే అదే. ఎప్పుడు చూడని ఓ కొత్త వాతావరణాన్ని తీసుకొచ్చింది’ అని ఓ స్పోర్ట్స్‌‌ చానెల్‌‌తో మాట్లాడిన విరాట్‌‌.. ఐపీఎల్‌‌తో తన అనుబంధాన్ని చాటుకున్నాడు. స్టార్‌‌ ప్లేయర్లున్నా.. ఐపీఎల్‌‌లో ఆర్‌‌సీబీ ఒక్కసారి కూడా టైటిల్‌‌ను గెలవలేకపోయింది. కానీ కోహ్లీ మాత్రం.. డివిలియర్స్‌‌, గేల్‌‌లాంటి మేటి ప్లేయర్లతో డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌ షేర్‌‌ చేసుకున్నాడు. ఆ ఎక్స్‌‌పీరియెన్స్‌‌తో టీమిండియాకు తిరుగులేని విజయాలను అందిస్తున్నాడు. అయితే ఫ్రాంచైజీలు కూడా తమ నగరాలను ఫ్యాన్స్‌‌కు దగ్గర చేస్తుండటంతో ఐపీఎల్‌‌ మరింత స్పెషల్‌‌గా మారిందని కెప్టెన్‌‌ చెప్పాడు. ‘ప్రపంచంలో ఎన్ని లీగ్‌‌లు ఉన్నా ఐపీఎల్‌‌ అంటేనే నాకు ఇష్టం. నీతో కలిసి ఆడే ఎంతో మంది కొత్త ప్లేయర్లతో ఎన్నో విషయాలను షేర్‌‌ చేసుకోవచ్చు. మన కంట్రీ ప్లేయర్లే కాకుండా వేరే దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా చాలా కాలంగా తెలుసు అనే భావన ఏర్పడుతుంది. వీళ్లలో కొంత మందిని తరచుగా చూడం కూడా. అయినా వాళ్లకు మనం ఓ కామ్రేడ్‌‌ అనే భావం పెరుగుతుంది. చాలా కాలం నుంచి  ప్రత్యర్థులుగా తలపడుతున్న విదేశీ క్రికెటర్లతో కూడా స్నేహభావం పెరుగుతుంది. అందుకే ప్లేయర్లు, ఫ్యాన్స్‌‌, వ్యూవర్స్‌‌ ఐపీఎల్‌‌ను బాగా ఇష్టపడతారు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

హోస్టింగ్​కు మేం రెడీ: యూఏఈ

కరోనా దెబ్బకు నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌–13ను నిర్వహించేందుకు చాలా దేశాల బోర్డులు ముందుకొస్తున్నాయి. ఆతిథ్యానికి తాము రెడీ అంటూ మొన్న శ్రీలంక ముందుకురాగా, ఇప్పుడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కూడా హోస్టింగ్‌ ఆఫర్‌ ఇచ్చింది. లీగ్‌ను నిర్వహించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తామని యూఏఈ ప్రపోజల్‌ పంపిందని బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ వెల్లడించాడు. ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ రిస్ర్టిక్షన్​ కొనసాగుతున్న ఈ టైమ్‌లో వాళ్ల ఆఫర్‌పై చర్చించే అవసరం లేదని స్పష్టం చేశాడు. ఒకవేళ లీగ్​ను నిర్వహించాల్సి వస్తే దేశంలో బయో సెక్యూర్​ స్టేడియాలను ఎంపిక చేసుకుంటామన్నాడు.