
ఇస్లామాబాద్: ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ అధినేత, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ ఆచూకీపై పాకిస్తాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తోన్న మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడో ఇస్లామాబాద్‌కు తెలియదని వింత వ్యాఖ్యలు చేశాడు. మసూద్ అజార్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడనుకుంటే.. పాక్‌లో అతడు ఎక్కడ ఉన్నాడో ఆ సమాచారాన్ని భారత్ మాకు అందిస్తే అతన్ని అరెస్టు చేస్తామని.. ఇందుకు పాకిస్థాన్ కూడా సంతోష పడుతుందని వ్యంగ్యంగా మాట్లాడాడు.
మేం అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాం కానీ కుదరలేదని నీతులు వల్లించాడు. మసూద్ బహుశా మసూద్ అజార్ ఆఫ్ఘానిస్తాన్‌లో ఉండొచ్చని షాకింగ్ కామెంట్స్ చేశాడు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గురించి కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేశాడు. హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా బయట తిరగడం లేదని.. అతడు పాకిస్థాన్ ప్రభుత్వ అదుపులో ఉన్నాడని చెప్పాడు.
కాగా, భారత్ లో ఎన్నో ఉగ్రదాడులకు సూత్రధారులైన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, జైషీ మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అప్పగించాలని భారతదేశం చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. వీరిద్దరూ పాకిస్థాన్ కేంద్రంగానే ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని ఎన్నోసార్లు ఆధారాలతో సహా భారత్ నిరూపించింది. కానీ పాకిస్థాన్ మాత్రం భారత వాదనను ఖండిస్తూ మాకేం తెలియదంటూ తెలివిగా తప్పించుకుంటుంది. తాజాగా బిలావల్ భుట్టో కూడా అలాగే మాట్లాడి తమ దేశ వక్రబుద్ధి మరోసారి ప్రదర్శించారు.
►ALSO READ | ఒకే తరహాలో తండ్రికొడుకుల హత్య: బీహార్‌లో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా దారుణ హత్య
2001 భారత పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడి వంటి అనేక ప్రధాన దాడుల మాస్టర్ మైండ్ మసూద్ అజార్. ఇప్పటికే భారత్ అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. 2019లో ఐక్యరాజ్యసమితి కూడా అజార్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC-814 హైజాక్ చేసి ఉగ్రవాదులు మసూద్ అజార్‌ను విడిపించారు. ఆ తర్వాత జైషీ మహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థాపించి భారత్‌లో ఎన్నో దాడులు చేయించాడు అజార్.