
కరీంనగర్ టౌన్, వెలుగు: గ్రామాల స్వచ్ఛత మెరుగుపరిచేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 సర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాలోని పలు జీపీల్లో కేంద్ర సర్వే బృందం ఆధ్వర్యంలో ‘అకాడమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్' టీం సభ్యులు శుక్రవారం కరీంనగర్ మండలం ఎలాబోతారం గ్రామాన్ని సందర్శించారు. అంతకుముందు కలెక్టరేట్ లో కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెత్త సేకరణ తీరు, పారిశుద్ధ్య సిబ్బంది చెత్త తరలింపు, ప్రభుత్వ సంస్థల పనితీరు తదితర అంశాలపై నేరుగా ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు టీం సభ్యులు కలెక్టర్‌కు తెలిపారు.
గ్రామంలో 16 నివాస గృహాలను సందర్శించి వారి అభిప్రాయాలను క్రోడీకరించి పరిశీలించారు. అనంతరం ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఎన్ వైకే కోఆర్డినేటర్ రాంబాబు, అకాడమిక్ ఆఫ్ మేనేజ్ మెంట్ సూపర్‌వైజర్లు జి.సురేశ్, పి.మధుకర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్స్ పాల్గొన్నారు.
ఆర్నెళ్లకోసారి వైద్య పరీక్షలు చేయించుకోండి
తిమ్మాపూర్, వెలుగు: ఆర్నెళ్లకోసారి ప్రతి మహిళ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రేణికుంట రైతు వేదికలో శుక్రవారం సభకు ఆమె హాజరై, మాట్లాడారు. మహిళలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. శుక్రవారం సభ ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. రేణికుంటలోని ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులతో మమేకమయ్యారు.