న్యూఢిల్లీ: తొందరగా వచ్చిన వేసవి ఎండలను తట్టుకోవడం కోసం జనం ఏసీలను కొంటుండడంతో ఈ ఏడాది రెసిడెన్షియల్ ఏసీల అమ్మకాలు 90 లక్షల యూనిట్లకు చేరచ్చని అంచనా. ఇది కొత్త రికార్డు అవుతుందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) మంగళవారం తెలిపింది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 17.5 లక్షల ఏసీ యూనిట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది. మార్కెట్లో డిమాండ్ బాగా ఉన్నప్పటికీ 5 స్టార్ రేంజ్ ఏసీల సప్లయ్ కొంత తగ్గే అవకాశం ఉండొచ్చని పేర్కొంది. కంట్రోలర్లు, కొన్ని విడిభాగాల సప్లయ్ తగినంతగా లేకపోవడమే దీనికి కారణమని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా చెప్పారు. ఏప్రిల్ 2021తో పోలిస్తే ఏప్రిల్ 2022లో రెసిడెన్షియల్ ఏసీల అమ్మకాలు ఏకంగా రెట్టింపయ్యాయని పేర్కొన్నారు. 2019 తో పోలిస్తే ఈ అమ్మకాలు 30–35 శాతం ఎక్కువని చెప్పారు. కరోనా ముందు స్థాయికి చేరుకునేలా గ్రోత్ ఉందన్నారు. ఏప్రిల్ నెల ట్రెండ్‌ని బట్టి చూస్తే మే, జూన్ నెలలలోనూ ఏసీల అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు బ్రగాంజా తెలిపారు.
వోల్టాస్ గ్రోత్ 100 శాతం..
మొదటి నాలుగు నెలల అమ్మకాల ఆధారంగా చూస్తే 2022లో రెసిడెన్షియల్ ఏసీల అమ్మకాలు 85 నుంచి 90 లక్షల యూనిట్ల దాకా ఉండొచ్చని బ్రగాంజా అన్నారు. దేశంలో ఇప్పటిదాకా ఇదే అత్యధికమని పేర్కొన్నారు. వేసవి వేడి ఎక్కువగానే ఉండటంతో జనం ఏసీలు కొనడానికి మొగ్గుచూపుతున్నారని చెప్పారు. చైనా నుంచి వచ్చే కంట్రోలర్లు, కంప్రెషర్లు తగినంతగా అందుబాటులో లేవని, దీంతో కొన్ని ప్రొడక్టుల తయారీ కష్టమవుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎనర్జీ ఎఫిషియెంట్ 5–స్టార్ రేటెడ్ మోడల్స్సప్లయ్ తగ్గొచ్చని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డారు. విడిభాగాల రేట్లు పెరగడంతో మార్జిన్లు నిలబెట్టుకోవడానికి ఏసీ తయారీ కంపెనీలు వాటి రేట్లను పెంచే ఛాన్స్ కూడా ఉందన్నారు. ఈ పెంపుదల 2 నుంచి 4 శాతం దాకా ఉండొచ్చని పేర్కొన్నారు. వోల్టాస్, పానాసోనిక్, హిటాచి, ఎల్జీ, హేయిర్ వంటి కంపెనీలన్నీ ఏప్రిల్ నెలలో రికార్డు లెవెల్ అమ్మకాలు నమోదు చేశాయి. టాటా గ్రూప్ కంపెనీ అయిన వోల్టాస్ఏసీల అమ్మకాలలో మునుపెన్నడూ లేనంత గ్రోత్తో 2019 ఏప్రిల్ అమ్మకాలను అందుకుంది. ఈ ఏడాది ఎండలు ముందుగానే రావడంతోపాటు, వేడిమి ఎక్కువగా ఉండటం వల్ల ఏసీలకు డిమాండ్ బాగా పెరిగిందని వోల్టాస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ బక్షి వెల్లడించారు. తమ కంపెనీ అమ్మకాలు మూడంకెల గ్రోత్నమోదు చేశాయన్నారు.
