
- సినిమా రిలీజ్ రోజే రికార్డు చేసి అదే రోజు టెలిగ్రాంలో షేర్
- వెబ్సైట్ నిర్వాహకులకు అమ్మకం
- ఏపీకి చెందిన ఏసీ టెక్నీషియన్ అరెస్టు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సినిమా రిలీజ్‌రోజే పైరసీ చేసి ఆన్లైన్లో పెడుతున్న ఓ వ్యక్తిని సైబర్ క్రైంపోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఏసీ టెక్నీషియన్ జానా కిరణ్ కుమార్ గా గుర్తించారు. మే 9న ‘సింగిల్’ తెలుగు సినిమా విడుదలైంది. ఈ సినిమా హెచ్డీ ప్రింట్ అదే రోజు పలు వెబ్ సైట్లలో సర్క్యులేట్అయ్యింది. దీనిపై తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రతినిధి యర్రా మనీంద్ర బాబు.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న జానా కిరణ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. పెద్ద సినిమాలను పైరసీ చేసి, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న ముఠాకు ఇతను సహకరిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు మొదట తమిళ్ ఎంవీ పైరసీ గ్రూప్ గురించి తెలుసుకున్నాడు. వారి రిక్రూట్‌మెంట్ ఈ మెయిల్‌ను సంప్రదించాడు. తెలుగు కంటెంట్‌ను అక్రమంగా సేకరించేందుకు కిరణ్వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కొత్త సినిమాలను రికార్డు చేయడానికి నిందితుడు 300 నుంచి 400 డాలర్లను (బిట్ కాయిన్‌లో) చార్జ్ చేశాడు. ఎక్కడి నుంచి వీడియో తీస్తే బాగా వస్తుందో అక్కడే సీటు రిజర్వ్ చేసుకుని సినిమాలు రికార్డు చేశారు. తర్వాత వాటిని టెలిగ్రాంలో వెబ్సైట్ నిర్వాహకులకు షేర్ చేశాడు. ఇలా ఒకటిన్నరేండ్లలో హైదరాబాద్‌లోని వివిధ థియేటర్లలో 40 సినిమాలను రికార్డు చేశాడు. నిందితుడి నుంచి పోలీసులు రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.