
కీర్తి సురేష్, సుహాస్ లీడ్ రోల్స్‌లో ఐ.వి.శశి తెరకెక్కించిన సెటైరికల్ కామెడీ మూవీ ‘ఉప్పు కప్పురంబు’. బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి ఇతర ముఖ్యపాత్రలు పోషించగా ఐ.వి.రాధిక లావూ నిర్మించారు. ఇవాళ శుక్రవారం (జులై 4న) నేరుగా ఓటీటీలోకి వచ్చింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం వంటి ఐదు భాషల్లో ప్రైమ్ వీడియోలోస్ట్రీమింగ్ అవుతోంది.
కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 240కిపైగా దేశాలు, ప్రాంతాల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. 'శుభం' రైటర్ వసంత్ మురళీకృష్ణ కథ అందించాడు. ఈ డిఫెరెంట్ కామెడీ ఎంటర్ టైన్లో సుహాస్, కీర్తి సురేష్ల నటన ఎలా ఉందో.. రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న చిట్టి జయపురం అనే చిన్న గ్రామం. అజ్ఞానం, పితృస్వామ్యం వంటి పురాతన పద్ధతులను అనుసరించే మూర్ఖ పాత్రలతో నిండి ఉంటుంది. ఆ గ్రామానికి పెద్దగా (సుబ్బరాజు) శుభలేఖ సుధాకర్ ఉంటారు. ఆయన అకాల మరణంతో గ్రామ పెద్దగా అతని కూతురు అధికారంలోకి అపూర్వ (కీర్తి సురేష్) వస్తుంది.
వయసులో చిన్నపిల్ల అయిన అపూర్య గ్రామ పెద్ద ఏంటి..? అంటూ భద్రయ్య (బాబు మోహన్), మధు (శత్రు) తీవ్రంగా వ్యతిరేఖిస్తారు. అంతకంటే ముఖ్యంగా వారు స్త్రీ నాయకత్వంలో ఉండటానికి అసలు ఇష్టపడరు. దానికితోడు అపూర్వను పడగొట్టాలని కోరుకుంటారు.
►ALSO READ | NC24: నాగ చైతన్య మైథికల్ థ్రిల్లర్ అప్డేట్..
ఈ క్రమంలోనే శ్మశానంలో భూమి కొరత వచ్చి పడుతుంది. కేవలం నలుగురికి మాత్రమే శ్మశానంలో సమాధి చేసేందుకు చోటు ఉంటుంది. ఇక స్మశానంలో శవాలను పాతి పెట్టడానికి చోటు లేకపోవడంతో హౌస్ ఫుల్ బోర్డు పెడతారు. కాటి కాపరి చిన్న (సుహాస్) సహాయంతో ఈ సమస్యను అపూర్వ ఎలా పరిష్కరించిందనేది మిగతా కథ.
మూవీ విశ్లేషణ:
డైరెక్టర్ IV శశి తనదైన శైలిలో కథనం రాసుకున్నాడు. స్త్రీ ద్వేషం, మత విభజన మరియు పితృస్వామ్యం వంటి సామాజిక సమస్యలను నేటికాలానికి అద్దంపట్టేలా తెరకెక్కించాడు. ఊర్లో ఉండే సామాజిక-రాజకీయ అంశాలు, ఆచారాలు, కట్టుబాట్లు వంటి సమస్యలను మూవీ హైలైట్ చేస్తుంది.
ప్రస్తుత సమాజంలో భూమి ఎంత విలువైందో చూస్తున్నాం. మనిషి చచ్చిపోయాక పూడ్చడానికి అవసరమైన ఆరడుగుల నేల కూడా కరువైతే? ఎలా ఉంటుందనేది అందరీకీ అర్ధమయ్యే కోణంలో చూపించాడు డైరెక్టర్. ఎందుకంటే 'శ్మశానం భూమి కొరత..' అనేది ప్రస్తుతం సమాజంలో నెలకొన్న సమస్యల్లో ఒకటి కాబట్టి. ఈ సందేశానికి తోడు సెటైరికల్ కామెడీ జోడించి అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాడు.
అయితే, ఒక మంచి మెసేజ్ కు.. వినోదం పేరుతో నేలవిడిచి సాము చేయడం కాస్తా మైనస్ గా అనిపిస్తోంది. చివరి అరగంట సినిమాకు ఆయువు పట్టు. శ్మశానం కోసం అపూర్వ, చిన్న కలిసి తీసుకునే నిర్ణయం ఎమోషనల్ గా ఉంటుంది. హృద్యమైన క్లైమాక్స్ మెప్పిస్తుంది.
ఎవరెలా నటించారంటే:
అపూర్వగా కీర్తిసురేశ్ తన విభిన్నమైన నటన కనబరిచింది. ఊరి పెద్దగా బాధ్యతలు స్వీకరించడం, ఆ తర్వాత వచ్చే కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో నటించి మెప్పించింది. హీరో సుహాస్ కాటి కాపరి పాత్రలో రాణించాడు. అమాయకత్వం నిండిన ఆ పాత్రకు ప్రాణం పోశాడు. క్లైమాక్స్‌కు వచ్చేసరికి కంటతడి పెట్టించారు. భీమయ్య పాత్రలో బాబు మోహన్ కూడా చక్కని పాత్రే దక్కింది. తనదైన కామెడీ టైమింగ్, నటనతో మెప్పించారు. బాగా గ్యాప్ వచ్చినప్పటికీ మంచి పాత్రతో తిరిగి కంబ్యాక్ ఇచ్చాడు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు:
పట్టణ జీవితం, హాస్యం, భావోద్వేగాలు అన్నింటినీ మనస్సుకు హత్తుకునేలా చేయడంలో స్వీకార్ అగస్తి మ్యూజిక్ పనిచేసింది. సినిమాటోగ్రఫీ దివాకర్ మణి పనితనం సినిమాకు బలంగా నిలిచింది. పల్లెటూరి వాతావరణాన్ని.. అక్కడి మనుషులను బాగా చూపించాడు. 'శుభం' రైటర్ వసంత్ మరింగంటినే అందించిన స్క్రిప్టు సందేశాన్ని ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. అందుకు దర్శకుడు శశి టేకింగ్ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లింది. ‘గ్రామదేవతగా ఆడది ఉంటే తప్పులేదు కానీ,.. ఊరి పెద్దగా ఉంటే తప్పేంటి?’ వంటి డైలాగ్స్ ను పెట్టి అందర్నీ ఆకట్టుకున్నాడు. కథకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.