టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సెంచరీలతో చెలరేగాడు. రాంచీ, రాయ్ పూర్ లో శతాకాలు బాది తనకు అచ్చోచ్చిన వైజాగ్ లో మూడో వన్డే ఆడేందుకు సిద్దమయ్యాడు. ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా జరుగుతోంది. సిరీస్ లో ఇప్పటికే రెండు వన్డేలు జరిగితే తొలి వన్డేలో ఇండియా.. రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలిచి 1-1 తో సమంగా ఉన్నాయి. చివరి వన్డే.. సిరీస్ డిసైడర్ కావడంతో భారీ హైప్ నెలకొంది.
ఈ మ్యాచ్ కి విరాట్ కోహ్లీ కారణంగానే టికెట్లన్నీ అమ్ముడుపోయినట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీడియా అండ్ ఆపరేషన్స్ జట్టు సభ్యుడు వై వెంకటేష్ తెలిపారు. "మొదటి దశ టిక్కెట్లు నవంబర్ 28న అమ్మకానికి వచ్చాయి. అప్పుడు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ రెండో దశ అమ్మకానికి ఒక రోజు ముందు కోహ్లీ రాంచీలో సెంచరీ సాధించాడు. దాంతో అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఇక్కడ కోహ్లీకి అత్యుత్తమ రికార్డు ఉందని మనందరికీ తెలుసు. కాబట్టి రెండవ, మూడవ దశ టిక్కెట్లు ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు అవి నిమిషాల్లోనే మాయమయ్యాయి". అని వై వెంకటేష్ చెప్పుకొచ్చారు.
►ALSO READ | IND vs SA: ఓపెనర్‌గా గైక్వాడ్.. నితీష్‌కు ఛాన్స్.. మూడో వన్డేకి టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరగబోయే మూడో వన్డేకు టిక్కెట్లు మిగిలి లేవు. ఫ్యాన్స్ రూ.1200 నుండి రూ.18,000 వరకు ధర ఉన్న టిక్కెట్లను కొనుగోలు చేశారు. YS రాజశేఖర రెడ్డి ADA-VDCA స్టేడియం పూర్తిగా నిండిపోవడంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా సంతోషంగా ఉంది. మూడో వన్డేలో గెలిచిన వారికి సిరీస్ దక్కుతుంది. సొంతగడ్డపై సిరీస్ పోగొట్టుకోకుండా ఉండేందుకు టీమిండియా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా రెండో వన్డే ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మూడో వన్డేలోనూ టీమిండియాకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. మూడో వన్డేలో ఎవరు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంటారో చూడాలి. మ్యాచ్ శనివారం (డిసెంబర్ 6) మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.
