పటాకుల షాప్​కు లైసెన్స్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ .. ఫైర్ ఆఫీసర్‌ షేక్ ఫరీద్‌‌

పటాకుల షాప్​కు లైసెన్స్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ ..  ఫైర్ ఆఫీసర్‌ షేక్ ఫరీద్‌‌

హైదరాబాద్‌, వెలుగు :  క్రాకర్స్ షాప్​కు  టెంపరరీ లైసెన్స్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన కూకట్‌పల్లి ఫైర్ స్టేషన్‌ ఆఫీసర్​ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..  కూకట్‌పల్లిలోని శంషీగూడకు చెందిన మేడారం రాజశేఖర్‌‌ సాఫ్ట్‌ వేర్‌‌ జాబ్ చేస్తున్నాడు. దీపావళి నేపథ్యంలో క్రాకర్స్ అమ్మేందుకు మణికంఠ ఫైర్ వర్క్స్‌ పేరుతో తాత్కాలిక లైసెన్స్ కోసం ఆన్​లైన్​లో అప్లయ్‌ చేసుకున్నాడు.

అతడి అప్లికేషన్‌ కూకట్‌పల్లి  ఫైర్ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉంది. దీంతో స్థానిక ఫైర్ ఆఫీసర్‌‌ షేక్ ఫరీద్‌ను కలిశాడు.  రూ. 500 చలానాతో టెంపరరీ లైసెన్స్ ఇవ్వాలని కోరాడు.  అయితే  వివిధ కారణాలు చూపుతూ లైసెన్స్‌ ఇచ్చేందుకు ఫరీద్‌ నిరాకరించాడు. రూ.3,500 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రాజశేఖర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం జేఎన్టీయూ క్యాంపస్ వద్ద రాజశేఖర్ నుంచి లంచం తీసుకుంటున్న ఫైర్ ఆఫీసర్ ఫరీద్​ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.