
గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వలన వాతావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ వలన వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగి మంచుతో ఏర్పడిన హిమానీనదాలు కరిగిపోయి సముద్రమట్టాలు పెరుగుతాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా అమర్‌నాథ్ గుహలో మంచుతో ఏర్పడిన శివలింగం సైతం గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా ఏర్పడకముందే త్వరగా కరిగిపోతున్నది.
పవిత్రమైన మంచు శివలింగానికి నిలయమైన అమర్‌నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా ఎగువ ప్రాంతంలో ఉంది. శ్రీనగర్ నుంచి దాదాపు 141 కి.మీ దూరంలో, పహల్గాం నుంచి సుమారు 48 కి.మీ దూరంలో ఉంది. అమర్‌నాథ్ గుహ సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఉండటం వలన గుహ సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పి ఉంటుంది.
జమ్మూ కాశ్మీర్‌లో జూన్లో వేసవికాలం
జమ్మూ కాశ్మీర్‌లో వేసవికాలం జూన్లో మొదలై ఆగస్టులో ముగుస్తుంది. మంచు శివలింగం వేసవి రోజులలో ఏర్పడుతుంది. అమర్‌నాథ్ గుహలోని శివలింగం ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన మంచు స్టాలగ్మైట్. వేసవిలో వెచ్చని ఉష్ణోగ్రతల కారణంగా హిమాలయాల నుంచి గుహ పైన ఉన్న మంచు కరుగుతుంది. కరుగుతున్న మంచు నుండి ఏర్పడిన నీరు అమర్‌నాథ్ గుహ పైకప్పు, గోడల నుంచి కిందికి ప్రవహిస్తుంది. నీరు అమర్‌నాథ్ గుహ లోపల చల్లని వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అది ఘనీభవించి క్రమంగా శివలింగం ఆకారంలోకి మారుతుంది.
శ్రావణ మాసంలో అమర్‌నాథ్ మందిరానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. అమర్‌నాథ్ యాత్ర సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టులో వచ్చే రక్ష బంధన్ పూర్ణిమ (పౌర్ణమి) నాడు ముగుస్తుంది. పౌర్ణమి రోజున మంచు శివలింగం అతిపెద్ద పరిమాణానికి చేరుకుంటుంది. సాధారణంగా ఆగస్టు చివరినాటికి లింగం కరిగిపోయి పూర్తిగా అదృశ్యమవుతుంది. 2025 లో అమర్‌నాథ్ యాత్ర జులై 3న ప్రారంభమైంది. ఆగస్టు 9న ముగియనుంది. గతంలో 12–-15 అడుగులుగా ఏర్పడే పవిత్ర శివలింగం, 2025 సంవత్సరం 1.5 నుంచి 2 అడుగుల ఎత్తు మాత్రమే ఏర్పడి అప్పుడే కరిగిపోవడం ప్రారంభించింది.
మంచు శివలింగం ఎందుకు త్వరగా కరిగిపోతున్నది?
అమర్‌నాథ్ మందిరానికి వెళ్లే మార్గం దుమ్ము, ధూళితో నిండి ఉంది. భక్తులు నడుస్తున్నప్పుడు, మ్యూల్స్‌పై స్వారీ చేస్తున్నప్పుడు లేదా పల్లకీలపై తీసుకువెళుతున్నప్పుడు భారీ ధూళి మేఘాలు కమ్ముకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో, ముఖ్యంగా శ్రీనగర్ చుట్టూ ఉన్న తీవ్రమైన వేడి, మంచు కరగడాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. జులై 5-, 2025 కాశ్మీర్‌లో గత 7 దశాబ్దాలలో గరిష్ట పగటి ఉష్ణోగ్రత 37.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పర్యాటక ప్రదేశం పహల్గాంలో కూడా అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
వాతావరణ నిపుణులు, స్థానిక అధికారుల అభిప్రాయం ప్రకారం ఇటీవలి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమపాతం లేకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతటా మంచు గణనీయంగా తగ్గింది. ఇటీవల కాలంలో అమర్‌నాథ్ యాత్ర కోసం హెలికాప్టర్లు వినియోగించడం, భారీగా బలగాల మోహరింపు, వాహనాల రద్దీ, తీవ్రమైన భక్తుల తాకిడి వంటి కారణాల చేత ప్రకృతి తీవ్రమైన ఒత్తిడికి గురై వాతావరణ మార్పు సంభవించి మంచు శివలింగం త్వరగా కరిగిపోతున్నది. 2025 సంవత్సరంలో మొదటి19 రోజులలో 3.21 లక్షల మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నారు.
ఇది ప్రకృతి హెచ్చరికనా?
ఈ సంవత్సరం శ్రీనగర్‌లో యాత్రికులు వేసవిలాంటి వేడిని గమనించారు. పవిత్ర మంచు శివలింగం త్వరగా కరిగిపోవడం అనేది ‘గ్లోబల్ వార్మింగ్ ప్రభావం’ వలన భవిష్యత్తులో భూగోళం ఎదుర్కొనబోయే పరిణామాలకు ప్రకృతి మానవాళికి జారీచేస్తున్న ఒక హెచ్చరికగానే భావించాలి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అమర్‌నాథ్ మంచు శివలింగంపై వాతావరణ మార్పు ప్రభావం. అమర్‌నాథ్ గుహలో ఏర్పడే పవిత్రమైన మంచు శివలింగం ప్రకృతి భక్తులకు ఇచ్చిన ఒక వరం.
- డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్-