రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక

రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 
  • ఎల్బీనగర్ లో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ 

దిల్ సుఖ్ నగర్, వెలుగు: రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని, కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్ ఘాట్ కొత్త కాపు యాదవరెడ్డి గార్డెన్స్ లో కొత్త రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేండ్లలో ఒక్క కొత్త రేషన్​కార్డు ఇవ్వలేదని, పైగా లబ్ధిదారులను తొలగించారని విమర్శించారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి రేషన్ కార్డ్ ఇచ్చి, ఆరు కిలోల సన్నబియ్యం ఇస్తోందన్నారు.

 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులివ్వడం లేదని, దీనిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీలు ప్రశ్నించాలన్నారు. డీఎస్​వో వనజాత మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా 21,887 రేషన్ కార్డులు జారీ చేశామని, మొత్తం 5,78,558 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, శాసనమండలి చీఫ్ విప్​ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రోడ్​డెవలప్​మెంట్​ కార్పొరేషన్ చైర్మన్ మల్​రెడ్డి రాంరెడ్డి, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, అధికారులు, కార్పొరేటర్లు, పాల్గొన్నారు.