
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జిల్లా విద్యాశాధికారులుగా ఐఏఎస్ ఆఫీసర్లను సర్కారు నియమించింది. మూడు జిల్లాలకు డీఈఓలుగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాకు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికి డీఈఓగా అదనపు బాధ్యతలిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాకు ఉట్నూర్ ఐటీడీఏ పీఓగా పనిచేస్తున్న ఖుష్బూ గుప్తాకు, జనగామ జిల్లాకు అడిషనల్ కలెక్టర్ పింకేశ్వర్ లలిత్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు.
అయితే ఖమ్మం, భద్రాచలం, ములుగు జిల్లాల డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో జెడ్పీ సీఈఓకు ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. డీఈఓలు లేని మూడు జిల్లాలకు ఐఏఎస్లనే ఇన్చార్జ్లుగా నియమించాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తున్నది. డీఈఓ పోస్టులను ఐఏఎస్లకు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ బాధ్యతలు తీసుకోవడానికి ఐఏఎస్లు కూడా ఆసక్తిగా లేరు.
పర్యవేక్షణ ఇబ్బందులు
ఐఏఎస్లు తమ ప్రధాన బాధ్యతలతోపాటు డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తించడంతో విద్యాశాఖ కేవలం పరిపాలనా పర్యవేక్షణకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయి ఇన్చార్జ్లుగా పనిచేసే వారినే నియమిస్తే పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.