నల్లజెండాలతో మాల సంఘాల నిరసన .. రిజర్వేషన్ల తీర్పు రోజును విద్రోహ దినంగా ప్రకటన

నల్లజెండాలతో మాల సంఘాల నిరసన .. రిజర్వేషన్ల తీర్పు రోజును విద్రోహ దినంగా ప్రకటన
  • రోస్టర్ పాయింట్ల కేటాయింపులో అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్

ట్యాంక్ బండ్, వెలుగు: గతేడాది ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా మాల సంఘాలు శుక్రవారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విద్రోహ దినంగా పాటించాయి. శుక్రవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మాల సంఘాలు, మాల విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల లీడర్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో  తెలంగాణ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, రాజు ఉస్తాద్, డా.మంచాల లింగస్వామి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. జి.చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సీవర్గీకరణ రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాలలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత అత్యున్నత న్యాయస్థానం చేసిన సూచనలను పట్టించుకోకుండా 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. 

సరైన డేటా తీసుకోకుండా ఎస్సీలను కులాల వారీగా వర్గీకరించి మాలలతో పాటు మరో 25 కులాలను గ్రూప్-3లో చేర్చి 5 శాతం రిజర్వేషన్ కల్పించి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ రంగాలలో 5 శాతం రిజర్వేషన్ కూడా అందకుండా రోస్టర్ విధానాన్ని రూపొందించారని మండిపడ్డారు. ఈ అస్తవ్యస్త రోస్టర్ విధానం ద్వారా గ్రూప్3 లో ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కంటే ముందు విడుదలైన విద్య ఉద్యోగ నోటిఫికేషన్లకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న విషయాన్ని పాలకులు గ్రహించాలని కోరారు.ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని న్యాయం చేయాలని.. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మన్నె శ్రీధర్ రావు తోపాటు మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.