
రాష్ట్ర ప్రభుత్వం, పురపాలికలు, పంచాయతీలలో కూడా ఫైళ్లు, రికార్డుల నిర్మాణం, నిర్వహణ నిత్యం జరుగుతోంది. అయితే, పబ్లిక్ రికార్డుల నిర్వహణలో ప్రమాణాలు ఆయా సిబ్బంది సామర్థ్యం బట్టి ఉంటాయి. కంప్యూటరీకరణ సరిగా జరగలేదు. రికార్డులు తారుమారు అయ్యాయి. డిజిటలీకరణ ఇంకా గందరగోళంగా ఉన్నది.
డేటా ఎక్కువ అయిన తరుణంలో పబ్లిక్ రికార్డుల నిర్వహణ ఒక బ్రహ్మపదార్ధంగా మారింది. శిక్షణ లేదు. పబ్లిక్ రికార్డుల మీద ప్రభుత్వ నిర్దిష్ట నిధులు లేవు. అవసరమైన ఖర్చు పెట్టడం లేదు. సీనియర్ అధికారులకు దీని మీద ధ్యాస లేదు. ఎవరి కంప్యూటర్లు వారు చూసుకోవడం తప్పితే ఒక పబ్లిక్ రికార్డు వ్యవస్థ మీద ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి ఎవరికీ పట్టింపు లేదు. కేంద్రం, రాష్ట్రాల మధ్య లేదా శాఖల మధ్య సమన్వయం లేదు.
రికార్డుల నవీకరణ పర్యవేక్షణ లేకపోవడంతో పాత, కొత్త మధ్య వ్యత్యాసాలు, తప్పులు ఎదురు అవుతున్నాయి. సమాచార హక్కు చట్టం కింద పబ్లిక్ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచడం, ఆ పనిలో క్రమంగా మెరుగుదల సాధించడం మీద ఒక వ్యవస్థీకృత స్పందన లేకపోవడం శోచనీయం.
సమాచార హక్కు చట్టానికి తూట్లు
పౌరులు సమాచారం అడిగితే ఇవ్వకపోవడానికి అసమర్థత కూడా ఒక కారణం. డిజిటలీకరణ నేపథ్యంలో వేగంగా, అడిగిన విధంగా, వివిధ రూపాలలో సమాచారం అందించగలిగే సామర్థ్యం వస్తుంది అని ఆశించినా దానికి భిన్నంగా స్పందన ఇంకా దిగజారింది. పబ్లిక్ రికార్డుల నిర్వహణలో లోపాల వల్ల ప్రభుత్వం, ప్రభుత్వ సిబ్బంది సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. సమాచార కమిషన్ ఈ విషయంలో లోతుల్లోకి వెళ్ళడం లేదు. ఉదాహరణకు ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారులు డిజిటల్ రికార్డులను పొందడానికి మధ్యవర్తులు లేదా స్థానిక అధికారుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. పురపాలికలలో, పంచాయతీలలో జనన, మరణ నమోదు ప్రక్రియలు కూడా గందరగోళంగా ఉంది.
భూమి రికార్డుల నిర్వహణలో ఒక మెట్టు దిగజారి వివిధ రకాల నేరాలకు ఆస్కారం కల్పిస్తున్నది. భూమి రికార్డులను తారుమారు చేసి అనేక గ్రామీణ కుటుంబాల ఘోషకు కారణమవుతున్న అవినీతి అధికారులు, ల్యాండ్ మాఫియా మీద కనీస చర్యలు లేవు. భూమి రికార్డుల నిర్వహణ వ్యవస్థలో లోపాల వల్లనే. పబ్లిక్ రికార్డులు తారుమారు చేసినా సదరు అధికారుల మీద చర్యలు లేవు.
పబ్లిక్ రికార్డుల చట్టం 1993.. ప్రజా రికార్డులను అనధికారికంగా నాశనం చేయడం లేదా తరలించడాన్ని నేరంగా పరిగణిస్తుంది. నేరస్థులకు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే, ప్రజా రికార్డుల చట్టం కింద ఇప్పటివరకు ఎవరైనా దోషులుగా విచారణకు గురైనట్లు ఎక్కడా సమాచారం లేదు.
పౌరుల రికార్డులు.. ప్రభుత్వాల సేకరణ
ఈ మధ్య పౌరుల వ్యక్తిగత సమాచారం వివిధ రూపాలలో ప్రభుత్వం సేకరిస్తున్నది. వివిధ పథకాల లబ్ధిదారుల సమాచారం ప్రభుత్వం డిజిటల్ రూపంలో సేకరించింది. ఆరోగ్య కార్డులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తామని ముఖ్యమంత్రులు, అధికారులు వాగ్దానాలు చేస్తున్నారు. పౌరుల నుంచి సేకరించే సమాచారం అత్యధికంగా వ్యక్తిగత సమాచారం ఉంటుంది.
ఈ సమాచారం గోప్యంగా ఉంటుందా? అనేకసార్లు ఈ సమాచారం చోరికి గురి అయినట్లు వార్తలు చదువుతున్నాం. సమాచారం బయటకు రావడం, చోరీకావడం పట్ల జవాబుదారీ ఎవరు అనేది కూడా నిర్ధారణ కావాలి. పౌరుల వ్యక్తిగత సమాచారం రాజకీయ పార్టీలు తీసుకున్నా, ఇంకా ఎవరికైనా అనధికారికంగా అందినా కఠినచర్యలు తీసుకునేవిధంగా చట్టం రూపొందించాలి.
ప్రభుత్వానికి సవాళ్లు
తెలంగాణలో భూమి రికార్డులు తప్పిపోయినట్లు నివేదికలు వచ్చాయి. గ్రామ పటాలు, ఫీల్డ్ మెజర్మెంట్ పుస్తకాలు, సేథ్వార్‌లతో సహా లక్షలాది భూమి రికార్డులు తప్పిపోయాయని అప్పట్లో అధికారులు వెల్లడించారు. రికార్డులు లేకపోవడం వల్ల ప్రధాన ప్రభుత్వ భూమిని గుర్తించడంలో, స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వానికి సవాళ్ళు ఎదురవుతున్నాయి.
2016లో దాదాపు 2.8 లక్షల సర్వే నంబర్లకు సంబంధించిన భూమి రికార్డులు కనిపించకుండా పోయాయని చీఫ్ కమిషనరేట్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గ్రహించారని వార్తలు వచ్చాయి. ఎవరిమీదా చర్యలు మాత్రం లేవు. పర్యవసానంగా లక్షలాది మంది రైతుల పాసు పుస్తకాలలో ఉన్న యజమాని పేరు, విస్తీర్ణం, సర్వే నంబర్లు ప్రభుత్వ రికార్డులలో లేవు. ఫలితంగా లక్షలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. ఇప్పటికీ ఎవరైనా కూడా వాటిని తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా భూమి రికార్డుల నిర్వహణ ఉండడం శోచనీయం.
చర్యలకు చట్టం ఉన్నట్లు లేదు!
తెలంగాణాలో ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మంత్రివర్గంలో జరిగిన చర్చ వివరాలు కాళేశ్వరం కమిషన్ అడిగినా ఆయా ఫైళ్ళు దొరకనట్లు వార్తలు చూస్తున్నాం. అసలు రికార్డులు తయారు చేయకుంటే అది పాలనలో లోపంగా, విధులలో నిర్లక్ష్యంగా పరిగణించి ఈ మేరకు చర్యలు చెప్పట్టే అవకాశం చట్టంలో ఉన్నట్టు లేదు. ఒకవేళ ఉంటే, సమాచార హక్కు కార్యకర్తలకు అది ఉపయోగపడుతుంది.
ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ‘రికార్డు’ కావాల్సిందే. చేసిన ప్రతి సమావేశం, లేదా పనికి ‘రుజువు’ ఉండాల్సిందే. హైదరాబాద్ శివార్లలో ఉన్న మృగవణి అటవీ పార్కులో దాదాపు 80 హెక్టార్లు మాయం. ఔటర్ రింగ్ రోడ్డు ఈ పార్కుని చీల్చిన తరువాత రెండు భాగాలలో ఎన్ని హెక్టార్లు మిగిలాయి అని చెప్పే ఫైళ్ళు ప్రభుత్వం వద్ద లేవు. దాదాపు ఇదే పరిస్థితి అన్ని అటవీ భూములకు ఉన్నది. రైతుల నుంచి దాదాపు 2.5 లక్షల హెక్టార్ల భూమి ఎక్కడ ఉందో తెలిపే ఫైలు TGIIC సంస్థ వద్ద లేదు. అనేక శాఖల ఆస్తుల మీద కనీస సమాచారం ప్రభుత్వం వద్ద లేదు.
ప్రభుత్వం పర్యవేక్షించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఇదే కథ పునరావృతమయ్యే అవకాశం ఉంది. పబ్లిక్ రికార్డుల స్థితిగతుల గురించి, ఎన్ని ఉన్నాయో, ఎన్నిమాయం అయ్యాయో తెలుసుకోవడానికి, సమస్య పరిమాణాన్ని నిర్ణయించడానికి ప్రభుత్వం ఒక స్వతంత్ర ఆడిట్ చెయ్యాలి.
పబ్లిక్ రికార్డుల నిర్వహణలో మెరుగుదల సాంకేతికత మార్పు ద్వారా మాత్రమే పరిష్కారం కాదు. ప్రభుత్వం అధికారులకు సరైన రికార్డు నిర్వహణలో శిక్షణ ఇవ్వడంలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. పబ్లిక్ రికార్డుల చట్టం సవరించి, శిక్షలు కఠినం చెయ్యాలి. ఒక ప్రత్యేక అధికారిని నియమించి పబ్లిక్ రికార్డుల నిర్వహణను ప్రభుత్వం పర్యవేక్షించాలి. రికార్డులు అనధికారికంగా మారిస్తే, తారుమారు చేస్తే, మాయం చేస్తే తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలి. పబ్లిక్ రికార్డులను గౌరవించడం ప్రజా ప్రతినిధులకు, అధికారులకు నేర్పాలి.
పబ్లిక్ రికార్డులు మాయం
జార్జ్ బుష్ పరిపాలనలో ఇరాక్ యుద్ధానికి సంబంధించిన 200 మిలియన్ల ఈమెయిల్‌లు కనిపించకుండా పోయాయని ఆమధ్య పెద్ద దుమారం రేగింది. మన దేశంలో ఏప్రిల్ 2011లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీలోని వివిధ విభాగాల నుంచి 44,000 ఫైళ్లు కనిపించకుండా పోయాయని కోర్టులో నివేదించారు.
ఇటీవల తెలంగాణ పశుసంవర్ధక శాఖలో కీలకమైన ఫైళ్లు కనిపించకుండా పోవడం లేదా దెబ్బతిన్నట్లు గుర్తించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు చెందిన ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)తోపాటు మరో నలుగురిపై ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. కార్యాలయంలోని భద్రతా కెమెరాలు కూడా దెబ్బతిన్నాయని పోలీసులు కనుగొన్నారు.
ఇది ఉద్దేశపూర్వకంగా చేశారనే అనుమానాలకు దారితీసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని రికార్డులను తగులబెట్టి కేసులో తమ పాత్రను రుజువు చేయకుండా జటిలం చేశారు కొందరు పోలీసు అధికారులు. తెలంగాణ పర్యాటక శాఖ కార్యాలయాల్లో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. అక్కడ అగ్నిప్రమాదం సంభవించి ముఖ్యమైన ఫైళ్లు, కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. అగ్నిప్రమాదంపై అనుమానాలు ఉన్నాయి.
- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్-