
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఏసీబీ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. అనంతరం వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ స్కూల్‌లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, జీసీసీ ద్వారా వస్తున్న సరుకులను సక్రమంగా వినియోగించడం లేదని గుర్తించామన్నారు. స్కూల్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయని, బాత్‌రూమ్స్‌కు కనీసం డోర్లు కూడా లేవన్నారు. రికార్డుల నిర్వహణ సరిగా లేదని, నైట్ వాచ్‌మెన్ లేకపోవడంతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. లీగల్ మెట్రాలజీ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల సాయంతో సంబంధిత ఆఫీసర్లకు రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. డ్యూటీ పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ జి. నర్సయ్య నిర్లక్ష్యం చేస్తున్నారని గుర్తించామన్నారు.
కామారెడ్డి ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో...
కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా జంగంపల్లి శివారులో ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్టుపై బుధవారం ఏసీబీ ఆఫీసర్లు దాడి చేశారు.నిజామాబాద్ రేంజ్ డీఎస్పీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో లెక్కలోకి రాని రూ. 16 వేలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆఫీస్ ఫైల్‌లో ఉన్న రూ. నాలుగు వేలు, ప్రైవేట్ వ్యక్తి శివకుమార్ వద్ద ఉన్న రూ. 29 వేలను స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్ట్‌లో ఉన్న సిబ్బందితో పాటు ప్రైవేట్ వ్యక్తులను విచారించారు. ఓ వైపు ఏసీబీ ఆఫీసర్ల తనిఖీ కొనసాగుతుండగానే... హైవేపై వెళ్లే లారీ డ్రైవర్లు యథావిధిగా డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్లడం గమనార్హం. ఈ అమౌంట్ రూ. 90 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.