బినామీల పేరుతో భారీగా ఆస్తులు

బినామీల పేరుతో భారీగా ఆస్తులు

బినామీల పేరుతో భారీగా ఆస్తులు
శివబాలకృష్ణ కేసులో 45 పేజీల రిమాండ్ రిపోర్ట్ 
50 ప్రాపర్టీలు గుర్తించిన ఏసీబీ 
రూ.కోటి, 120 ఇంపోర్టెడ్ వాచ్ లు సీజ్ 
ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్లు, రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు గుర్తింపు 

హైదరాబాద్‌‌, వెలుగు: హెచ్‌‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. బాలకృష్ణ అవినీతిలో దళారులుగా వ్యవహరించిన ఉద్యోగులు, రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారుల చిట్టా బయటకు తీస్తున్నారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. డాక్యుమెంట్లు ఎవరి పేరుతో ఉన్నాయి? వారికి బాలకృష్ణకు ఉన్న సంబంధమేంటి? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.  ఈ కేసులో మొత్తం  45 పేజీల రిమాండ్ రిపోర్ట్‌‌ను కోర్టుకు ఏసీబీ అందజేసింది. బాలకృష్ణను విచారించేందుకు వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ ఫైల్ చేసింది. దీనిపై ఏసీబీ స్పెషల్ కోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది. 

ఫ్లాట్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలు.. 

శివబాలకృష్ణ రిమాండ్‌‌ రిపోర్ట్‌‌లో ఏసీబీ కీలక వివరాలను వెల్లడించింది. బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు సోదాల్లో గుర్తించింది. 2012లో శివబాలకృష్ణ ఉద్యోగంలో చేరగా, అప్పటి నుంచి ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరించింది. మొత్తం 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, 50 ప్రాపర్టీస్‌‌ను సీజ్ చేసింది. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో పెంట రమాదేవి, రాయదుర్గం మైహోమ్ భుజాలో డింగరి కిరణ్‌‌ ఆచార్య, హనుమకొండ భవానీనగర్‌‌‌‌లో సింగరాజు ప్రమోద్‌‌కుమార్‌‌‌‌, మాదాపూర్‌‌ లో ‌‌సాహితీ సుముఖి ఆర్బిట్‌‌ అపార్ట్‌‌మెంట్‌‌, హబ్సిగూడ వీవీనగర్‌‌‌‌లో కొమ్మిడి సందీప్‌‌కుమార్ రెడ్డి పేర్లతో ఉన్న ఫ్లాట్స్‌‌, బాచుపల్లి శిల్ప ఆర్‌‌‌‌వీ ధరిస్తా అపార్ట్‌‌మెంట్‌‌లో జి.సత్యనారాయణ మూర్తి పేర్లతో ఉన్న ఫ్లాట్స్‌‌ను గుర్తించింది. బంజారాహిల్స్ రోడ్‌‌12 ఎమ్మెల్యే కాలనీలోని సాయి సందీప్‌‌ ఇన్‌‌ఫ్రా ప్రాజెక్ట్స్‌‌, కొత్తపేట్‌‌ ఆర్‌‌‌‌కే పురంలోని ఎస్‌‌ఎస్‌‌ కన్‌‌స్ట్రక్షన్స్‌‌లో సోదాలు చేసింది. ఫ్లాట్స్‌‌, రియల్‌‌ ఎస్టేట్‌‌ కంపెనీలు బాలకృష్ణకు చెందినవిగా అనుమానిస్తున్నది. 

8 కోట్ల బంగారం, వెండి..   

శివబాలకృష్ణ ద్వారా లబ్ధి పొందినోళ్లు ఆయనకు ఖరీదైన వాచ్‌‌లు గిఫ్ట్‌‌ గా ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిందితుడి ఇంట్లో సోదాల సమయంలో రూ. 99.60 లక్షల నగదు, రూ.32.38 లక్షలు విలువ చేసే రోలక్స్, రాడో సహా ఇంపోర్టెడ్‌‌ వాచ్‌‌లు స్వాధీనం చేసుకున్నారు. రూ.51 లక్షలు విలువ చేసే నాలుగు కార్లు, నాలుగు బ్యాంకుల్లో రూ.58 లక్షల బ్యాలెన్స్‌‌ ఉన్నట్టు గుర్తించారు. 

ఇంకా బ్యాంక్​లాకర్స్‌‌ను ఓపెన్ చేయాల్సి ఉంది. సోదాల్లో మొత్తం రూ.8.26 కోట్లు విలువ చేసే బంగారం, వెండి, గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. 155కు పైగా డాక్యుమెంట్, ఎల్‌‌ఐసీ బాండ్స్, ఐటీ రిటర్న్స్‌‌కు సంబంధించిన డాక్యుమెంట్లు 20, నాలుగు బ్యాంక్ లాకర్స్‌‌ను ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణకు సహకరించిన అధికారులు, రియల్ ఎస్టేట్‌‌వ్యాపారుల వివరాలను సేకరిస్తున్నది.