ఏసీబీ చేతికి గొర్రెల స్కామ్‌‌ .. పశు సంవర్ధక శాఖ అడ్డాగా గోల్‌‌మాల్‌‌

ఏసీబీ చేతికి గొర్రెల స్కామ్‌‌ ..  పశు సంవర్ధక శాఖ అడ్డాగా గోల్‌‌మాల్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు :  గొర్రెల పంపిణీ స్కీమ్‌‌లో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. అవినీతికి పాల్పడిన అధికారులు, ఆఫీసర్స్‌‌ ఆన్‌‌ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌‌డీ)లను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం నిపుణుల సలహాలు తీసుకుంటున్నది. గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌‌లో, పశు సంవర్ధక శాఖలో ఫైల్స్‌‌ మాయం అయ్యాయని నాంపల్లిలో కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌‌ డైరెక్టర్లు రవికుమార్‌‌, కేశవసాయి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ ఓఎస్‌‌డీ కల్యాణ్‌‌పై గచ్చిబౌలి, నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 2 కేసుల ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లు ఏసీబీకి ట్రాన్స్‌‌ఫర్ అయ్యాయి. ఈ కేసులను ఏసీబీ దర్యాప్తు చేయనుండగా.. సీఐడీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

అధికారుల బినామీ అకౌంట్స్‌‌కు డబ్బు

గొర్రెల పంపిణీ స్కీమ్‌‌లో భాగంగా గొర్రె పిల్లలు కొనుగోలు చేసేందుకు గత ఏడాది ఆగస్టులో కొండాపూర్‌‌కు చెందిన సయ్యద్‌‌ మొయిద్‌‌కు చెందిన ‘లోలోనా ది లైవ్‌‌’ కంపెనీకి అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్‌‌ ఇచ్చింది. గొర్రెల కొనుగోలు కోసం పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌‌ డైరెక్టర్లు రవికుమార్‌‌, కేశవసాయిలతో కలిసి కాంట్రాక్టర్‌‌ ‌‌మొయిద్‌‌ ఇతర రాష్ట్రాల్లో తిరిగారు. చివరిగా ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 18 మంది రైతుల వద్ద 133 యూనిట్ల గొర్రెలను కొనుగోలు చేశారు. డబ్బును డిపాజిట్‌‌ చేయాల్సిన బాధ్యతను కాంట్రాక్టర్‌‌ మొయిద్‌‌కు అప్పగించారు. కానీ 18 మంది రైతులకు అందించాల్సిన మొత్తం రూ.2.10 కోట్ల నగదు వారి అకౌంట్స్‌‌లో డిపాజిట్‌‌ కాలేదు. బాధిత రైతులు పశు సంవర్ధక శాఖ కార్యాలయాన్ని సంప్రదించగా.. అప్పటికే డబ్బులు డిపాజిట్ అయినట్లు అక్కడ చెప్పారు. తమకు రావాల్సిన డబ్బు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పలు అకౌంట్స్‌‌లో డిపాజిట్ అయినట్లు రైతులు గుర్తించారు. బినామీ ఖాతాల్లోకి తరలించి తమను మోసం చేసినట్లు తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ మొయిద్‌‌కు చెందిన కంపెనీ గచ్చిబౌలి పీఎస్‌‌ పరిధిలో ఉండడంతో డిసెంబర్‌‌‌‌లో ‌‌అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొయిద్‌‌తో పాటు అసిస్టెంట్‌‌ డైరెక్టర్లు రవికుమార్‌‌, కేశవసాయిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంట్రాక్టర్ మొయిద్‌‌, అధికారులు కలిసి బినామీ అకౌంట్లను క్రియేట్‌‌ చేసి.. అందులోకి డబ్బు డిపాజిట్ చేశారని తెలిసింది. 

పశు సంవర్ధక శాఖ అడ్డాగా

ఈ అక్రమాల్లో మంత్రి తలసాని ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్‌‌, ఇతర అధికారుల ప్రమోయం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో డిసెంబర్‌‌‌‌ 8న మాసబ్‌‌ట్యాంక్‌‌లోని పశు సంవర్ధక శాఖ ఆఫీస్‌‌లోకి కల్యాణ్‌‌ అక్రమంగా చొరబడి.. సిబ్బంది సాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను బయటికి తెచ్చాడు. కొన్ని చించేసి, ముఖ్యమైన ఫైల్స్‌‌ను కారులో తీసుకెళ్లాడు. వాచ్‌‌మన్‌‌ మందాల లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓఎస్‌‌డీ కల్యాణ్‌‌, కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజా, మోహన్, అటెండర్ వెంకటేశ్, ప్రశాంత్‌‌లను నిందితులుగా చేర్చారు.

తలసానికి నోటీసులు?

ఎఫ్‌‌ఐఆర్‌‌లో నమోదైన పేర్ల ఆధారంగా అధికారులను మొదట ఏసీబీ విచారించ నుంది. తర్వాత వారికి సహకరించిన పెద్దలపై దృష్టి పెట్టనుంది. ఎవరెవరిపై కేసులు నమోదు చేయవచ్చనే దానిపై అధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. గతంలో ఆ శాఖ మంత్రిగా పని చేసిన తలసానితో పాటు అప్పటి డైరెక్టర్‌‌ లక్ష్మారెడ్డికి నోటీసులు ఇచ్చే విషయంపై లీగల్‌‌ ఒపీనియన్‌‌ తీసుకుంటు న్నట్లు సమాచారం. ఇదంతా పూర్తయితే గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడే అవకాశాలున్నా యని ప్రచారం జరుగుతున్నది.