లారీ డ్రైవర్ల వేషాల్లో ఏసీబీ ఆఫీసర్లు

లారీ డ్రైవర్ల వేషాల్లో ఏసీబీ ఆఫీసర్లు
  •     ఆర్టీఏ కార్యాలయాల వద్ద డెకాయిట్​ ఆపరేషన్ 
  •     చెక్‌‌పోస్టులపై అధికారుల దాడులు.. రూ.2.70 లక్షలు స్వాధీనం
  •     రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలతో ఉద్యోగులు, దళారుల్లో కలకలం
  •     ఏసీబీ అదుపులో పలువురు సిబ్బంది, మధ్యవర్తులు

 హైదరాబాద్/అశ్వారావుపేట, వెలుగు:  తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్​ సరిహద్దు చెక్​పోస్టుల్లో ఏసీబీ అధికారులు సినిమా స్టైల్​లో దాడులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో మంగళవారం మారువేషాల్లో తనిఖీలు నిర్వహించారు. ఊహించని రీతిలో ఏసీబీ డెకాయిట్​ఆపరేషన్​ నిర్వహించడంతో అధికారులు, ఉద్యోగులు, దళారుల్లో కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బోర్డర్​ చెక్​పోస్టు వద్ద గత కొన్ని రోజులుగా డ్రైవర్ల నుంచి ఆర్టీఏ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

 దీంతో అధికారులు లారీ డ్రైవర్ల వేషాల్లో వచ్చి లంచం తీసుకుంటున్న ఆర్టీఏ సిబ్బందిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. లారీ డ్రైవర్లు నేరుగా 22 చక్రాల వాహనాలకు 800, 16 చక్రాలకు 400 ,12 చక్రాల వెహికల్స్​కు 200 చొప్పున ఆర్టీఏ సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్టు తేలింది. బాధితుల నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నామని, రికార్డుల్లో ఉన్న నగదుకు, సోదాల్లో దొరికిన డబ్బుకు పొంతన లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. 

అలాగే, ఏసీబీ అధికారులు డ్రైవర్లు, సాధారణ ప్రజల్లాగా వెళ్లి కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి దందాను పరిశీలించారు. రవాణా శాఖలో అవినీతి పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. హైదరాబాద్​తో పాటు రంగారెడ్డి, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్, కరీం నగర్, ఆదిలాబాద్, మహబూబాబాద్​ తదితర ప్రాంతాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో డబ్బు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

దాదాపు 12 ఏండ్ల తర్వాత ఆర్టీఏపై ఏసీబీ దాడులు జరగడం గమనార్హం. పలు జిల్లాల్లో ఏజెంట్లు, డ్రైవర్లు, అనధికార వ్యక్తులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రవాణా శాఖ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు ఉండకూడదన్న నిబంధనలను చాలా ఆర్టీఏ కార్యాలయాలు అతిక్రమించాయని తనిఖీల్లో తేలింది. డీడీలు, చెక్కులతో లావాదేవీలు నడపాల్సి ఉన్నా .. చాలా కార్యాలయాల్లో నగదు లావాదేవీలు జరుగుతున్నట్టు గుర్తించారు. 

ఇకహైదరాబాద్​లోని మలక్​పేట, పాతబస్తీ, బండ్లగూడ, టోలీచౌకి, మణికొండ, ఖైరతాబాద్​,నాగోల్ తదితర కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించి, పలు కీలకపత్రాలు, లెక్కచూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. 

చెక్​పోస్టుల వద్ద తనిఖీలు

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లోని బోరజ్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం  జైనథ్ మండలం బోరజ్ జాతీయ రహదారి నెంబర్ 44 వద్ద గల అంతర్రాష్ట్ర వాహనాల తనిఖీ కేంద్రంలో సోదాలు నిర్వహించి, ఆర్టీఏ సిబ్బంది అవినీతి కార్యకలాపాలపై విచారించారు.

 రాష్ట్రంలోనే అతిపెద్ద చెక్ పోస్టుగా పేరున్న బోరజ్ తనిఖీ కేంద్రంలో మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్​ యశ్వంత్, ఏఎంవీఐ అపర్ణ విధులు నిర్వహిస్తుండగా.. అక్కడే కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ప్రతిరోజూ వేలాది వాహనాలు బోరజ్ చెక్ పోస్ట్ మీదుగా రాకపోకలు సాగిస్తుండగా భారీ వాహనాలకు సంబంధించి లైసెన్స్​ పర్మిట్, సరుకు రవాణా వేబిల్స్, వాహన బిల్లులు డాక్యుమెంట్లపై ఎంత మేరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయంపై ప్రశ్నలు సంధించారు.

 ప్రతిరోజూ వాహనదారులు చెల్లించే నగదు డబ్బు, ఆఫీసులో నమోదు చేసే బిల్లుల వివరాలపై రికార్డులు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులను నియమించడంపై కేసులు కూడా నమోదు చేసినట్టు తెలిసింది. బ్రోకర్లు తమ హవా కొనసాగిస్తున్నారని, సామాన్యులు లంచం ఇవ్వనిదే పని కావడం లేదని  ఫిర్యాదులు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

ఏక కాలంలో ఉమ్మడి పది జిల్లాల్లో తనిఖీలు 

నగరంలోని మలక్‌‌పేట్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించడంతో దరఖాస్తుదారులను నిలిపివేశారు. పాతబస్తీలోని బండ్లగూడ, టోలిచౌకి, మలక్‌‌పేటలోని ఈస్ట్ జోన్ వద్ద ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట చెక్‌‌పోస్ట్ దగ్గర ఏసీబీ అధికారులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు.  అలాగే చెక్ పోస్టులో అనధికారికంగా విధుల్లో ఉన్న ఏడుగురిని అధికారులు గుర్తించారు. 

15 ప్రత్యేక బృందాలతో దాడులు

రంగారెడ్డి జిల్లాకు చెందిన మణికొండ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.  పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పలు ఫైల్స్‌‌తో పాటు డబ్బులను గుర్తించారు. ఓ జూనియర్ అసిస్టెంట్‌‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 మరోవైపు హైదరాబాద్ వెస్ట్ జోన్ కార్యాలయంలోనూ విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అటు టోలిచౌకి ఆర్టీఏ ఆఫీస్‌‌లోనూ దాడులు కొనసాగాయి. నగరంలోని ఖైరతాబాద్​, నాగోల్​, మలక్​పేట తదితర ఆర్టీఏ కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రత్యేక బృందాలతో నిర్వహించిన దాడుల్లో రూ. 2,70,720  నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

మారువేషాల్లో డెకాయ్ ఆపరేషన్

ఆర్టీఏ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలను స్వయంగా తెలుసుకునేందుకు పలువురు ఏసీబీ అధికారులు మారువేషాల్లో కార్యాలయాలకు వచ్చినట్టు సమాచారం. అశ్వరావు పేట బార్డర్​ చెక్​ పోస్టు వద్దకు కొందరు అధికారులు లారీ డ్రైవర్ల వేషంలో వెళ్లారు. అక్కడ కొందరు అధికారులు లంచాలు అడగడంతో వారిని పట్టుకున్నారు.