ఏసీబీ దూకుడు .. శివబాలకృష్ణ బినామీలకు నోటీసులు

ఏసీబీ దూకుడు ..  శివబాలకృష్ణ బినామీలకు నోటీసులు


హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది.  ఈ కేసులో శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్న   భరత్, సత్యనారాయణ ,భరణిలకు నోటీసులు అందజేసింది. ఈ కేసును  మరింత లోతుగా విచారించేందుకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా విచారణ చేయనుంది ఏసీబీ.  అంతేకాకుండా బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్‌కు ఏసీబీ లేఖ రాసింది.  

 మరోవైపు ఆయనకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమైంది.  ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకోనుంది ఏసీబీ. శివ బాలకృష్ణ ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నట్లు గుర్తించిందిఏసీబీ. 2021 నుంచి 2023లోనే కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు తేల్చింది. యాదాద్రి జిల్లాలో శివ బాలకృష్ణ కు ఉన్న 57 ఎకరాల భూమిపై విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు.

కాగా ఆదాయానికి మించి ఆస్తుల సంపాదన కేసులో శివబాలకృష్ణను   ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  హెచ్‌‌ఎమ్‌‌డీఏ టౌన్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. గత పన్నెండేళ్లలో శివబాలకృష్ణ ఆదాయం రూ.2.48 కోట్లు కాగా.. ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే రూ.8.26 కోట్లుగా ఏసీబీ గుర్తించింది.

శివబాలకృష్ణ హెచ్‌‌ఎండీఏలో 2018 నుంచి గతేడాది వరకు  టౌన్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం రేరా సెక్రటరీగా పనిచేస్తున్నాడు. గతంలో మున్సిపల్‌‌అడ్మినిస్ట్రేషన్‌‌ అండ్ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా పనిచేశాడు. ఆ  సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.