ట్రంక్​ పెట్టెలో రూ. 2 కోట్లు

ట్రంక్​ పెట్టెలో రూ. 2 కోట్లు
  • మర్రిగూడ తహసీల్దార్‌‌‌‌ ఇంట్లో పట్టుకున్న ఏసీబీ
  •     ఇల్లు, ఆఫీసు, బంధువుల నివాసాల్లో ఒకేసారి రెయిడ్స్
  •     ఏసీబీ జడ్జి ముందు హాజరు.. చంచల్​గూడ్​జైలుకు తరలింపు

హైదరాబాద్‌‌, వెలుగు :  నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్‌‌ ‌‌మంచిరెడ్డి మహేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతితో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడనే ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు చేశారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం హస్తినాపురంలోని షిరిడీసాయినగర్‌‌‌‌లో గల మహేందర్‌‌‌‌ రెడ్డి ఇల్లు, మర్రిగూడ తహసీల్దార్​ ఆఫీస్‌‌, కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లు సహా మొత్తం15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. శనివారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేశారు.
 

మహేందర్‌‌‌‌ రెడ్డి ఇంట్లో ట్రంకు పెట్టెలో దాచిన రూ.2.07 కోట్లకు పైగా నగదు, 259 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.4 కోట్ల 57 లక్షల విలువచేసే స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్‌‌ బుక్స్‌‌, కార్డ్స్, మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌‌లో మహేందర్‌‌‌‌ రెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించి ఏసీబీ జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌‌గూడ జైలుకు తరలించారు.

జూనియర్ అసిస్టెంట్‌‌గా జాయినింగ్‌‌

ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన మహేందర్‌‌‌‌రెడ్డి జూనియర్ అసిస్టెంట్‌‌గా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఆ తరువాత తహసీల్దార్‌‌‌‌గా ప్రమోషన్‌‌ పొందారు. గతంలో రంగారెడ్డి జిల్లా కందుకూరు తహసీల్దార్‌‌‌‌గా పనిచేశారు. ఎలక్షన్స్ ట్రాన్స్‌‌ఫర్స్‌‌లో భాగంగా ఇటీవలే మర్రిగూడకు బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో జూనియర్ అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్న సమయం నుంచే మహేందర్‌‌‌‌ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కందుకూరు తహసీల్దార్‌‌‌‌గా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డాడని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి.

ఆస్తుల వివరాలు సేకరించి సోదాలు

మహేందర్‌‌‌‌ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులతో బంజారాహిల్స్‌‌లోని ఏసీబీ హెడ్‌‌క్వార్టర్స్‌‌లో ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. ఈ కేసును సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌‌ దర్యాప్తు చేసింది. మహేందర్‌‌‌‌రెడ్డికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. ఉద్యోగంలో జాయిన్‌‌ అయిన నాటి నుంచి మహేందర్ రెడ్డి సంపాదించిన ఆస్తుల వివరాలు రాబట్టారు. ఫిర్యాదుల్లో బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అవినీతి చిట్టాను సేకరించారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి వరకు సోదాలు జరిపారు. తనిఖీలు ఆదివారం కూడా కొనసాగే అవకాశం ఉంది. సోమవారం బ్యాంక్ లాకర్స్‌‌ను ఓపెన్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.