హైదరాబాద్ జలమండలి జీఎం కుమార్ నివాసంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం ( మే 19 ) సోదాలు నిర్వహించారు అధికారులు. హైదరాబాద్ లో మొత్తం 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్ లోని కుమార్ నివాసంలో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సోదాల్లో భారీగా నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. కోటి వరకు లిక్విడ్ క్యాష్ గుర్తించినట్లు తెలిపారు అధికారులు.
ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న ఈ సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి షాక్ అయ్యారు అధికారులు. కౌంటింగ్ మెషిన్లు ఉపయోగించి నగదు లెక్కిస్తున్నారు అధికారులు. స్వాధీనం చేసిన నగదు, ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు దర్యాప్తు బృందం. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది
సోదాల్లో పట్టుబడ్డ నగదు, ఇతర వివరాలకు సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ దాడుల్లో లభించిన మొత్తం ఆస్తి విలువ సోదాలు ముగిసిన అనంతరం వెల్లడిస్తామని తెలిపారు అధికారులు.జీఎం కుమార్ కు సంబంధించిన స్థిర, చరాస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు అధికారులు.
