
- లెక్కల్లో చూపని రూ.97,830 స్వాధీనం
- 32 మంది ప్రైవేట్ వ్యక్తుల గుర్తింపు
- అవినీతి అధికారులపై ప్రభుత్వానికి నివేదిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా ఝులిపిస్తున్నది. అవినీతికి ఎక్కువ అవకాశాలు ఉన్న పోలీస్, ఆర్టీఏ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కామారెడ్డి ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన తరహాలోనే గురువారం రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపుదాడులు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్, మెదక్ జిల్లా సదాశివపేట్, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎస్‌ఆర్‌వో కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.
ఈ మేరకు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. బీబీనగర్ ఎస్‌ఆర్‌వో కార్యాలయంలో తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.61,430 స్వాధీనం చేసుకోవడంతో పాటు కార్యాలయ ఆవరణలో 12 మంది అనధికారిక డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేటు వ్యక్తులను గుర్తించి 93 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జడ్జర్ల ఎస్‌ఆర్‌వోలో రూ.30,900 నగదు, 20 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని11 మంది అనధికారిక వ్యక్తులను గుర్తించినట్టు తెలిపారు.
సదాశివపేట్ ఎస్‌ఆర్‌వోలో రూ.5,500 లెక్కల్లో చూపని డబ్బుతో పాటు 9 మంది ప్రైవేటు వ్యక్తులను గుర్తించారు. 39 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్ని కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని, సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని పేర్కొన్నారు. అన్ని అకవతవకలపై తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్టు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు.