గొర్రెల స్కామ్‌‌‌‌‌‌‌‌పై ఏసీబీ రిపోర్ట్ రెడీ

గొర్రెల స్కామ్‌‌‌‌‌‌‌‌పై ఏసీబీ రిపోర్ట్ రెడీ
  •  బిల్లుల చెల్లింపులో అవకతవకలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: గొర్రెల పంపిణీ స్కామ్‌‌‌‌‌‌‌‌లో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. స్కీమ్‌‌‌‌‌‌‌‌లో అక్రమాలపై పూర్తి వివరాలు సేకరించింది. బాధిత రైతులు, పశుసంవర్ధకశాఖ అధికారులు ఇచ్చిన వివరాలు, ఎంక్వైరీలో సేకరించిన ఆధారాలతో సమగ్ర రిపోర్టు రూపొందించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో బిల్లు చెల్లింపుల విధానంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ప్రైవేటు ఏజెంట్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల అనుచరులు కుమ్మక్కై స్కీమ్‌‌‌‌‌‌‌‌ డబ్బులు గోల్‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. 

దీనిపై మొత్తం రిపోర్ట్ మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందించేందుకు ఏర్పాట్లు చేసింది. స్కీమ్‌‌‌‌‌‌‌‌లో రైతులకు చేరాల్సిన రూ.2.10కోట్లు కాంట్రాక్టర్, పశుంవర్ధకశాఖ అధికారులు కలిసి కొట్టేసిన సంగతి తెలిసిందే. గత డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గచ్చిబౌలి పీఎస్‌‌‌‌‌‌‌‌లో నమోదైన కేసు ఆధారంగా ఏసీబీ దర్యాప్తు చేసింది. 18 మంది బాధిత రైతుల స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేసింది.

10 బినామీ అకౌంట్లకు డబ్బుల మళ్లింపు

బినామీ అకౌంట్లకు డబ్బుల మళ్లింపులో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ముంత ఆదిత్య కేశవ సాయి కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పల్నాడు జిల్లా రైతులకు చేరాల్సిన డబ్బును 10 అకౌంట్లకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. నవాజ్‌‌‌‌‌‌‌‌, హిమజ మల్ల, కండ్రకోట కోటేశ్వరరావు, కొత్తకోట శ్రీనివాసులు, లింగ కోటేశ్వర రావు, లింగ రవితేజ, శెట్టి, మహ్మద్ అలీ, ఎల్ల పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌, పోలయ్యలకు చెందిన అకౌంట్లకు డబ్బులు మళ్లించినట్లు గుర్తించారు.

 సంబంధిత బ్యాంకులకు లెటర్స్ రాసి ఆయా అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఖాతాదారులకు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేశారు. వారిచ్చిన సమాచారంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొంత మంది ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల వ్యవహారం బయటపడే అవకాశం ఉంది. బినామీ ఖాతాల్లో జమ అయిన మొత్తం డ్రా చేశారా, లేక ఇతర ఖాతాలకు బదిలీ అయ్యాయా అనేది ఎంక్వైరీ చేస్తున్నారు.

స్కామ్‌‌‌‌‌‌‌‌లో కుమ్మక్కైన అధికారులు

ఈ కేసులో ధర్మపురి రవి, ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వాటర్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సంగు గణేశ్ ను ఏసీబీ గత గురువారం అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితులైన కాంట్రాక్టర్ మొహిదుద్దీన్, సయ్యద్‌‌‌‌‌‌‌‌ ఇక్రముద్దీన్‌‌‌‌‌‌‌‌ విదేశాలకు పారిపోవడంతో వారిపై లుక్‌‌‌‌‌‌‌‌ ఔట్ సర్క్యూలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. అలాగే బాధితుల స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ రికార్డ్​ చేశారు. 

రైతులకు చేరాల్సిన డబ్బు బదిలీ అయిన అకౌంట్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తించింది. రెండు, మూడు ఖాతాల్లో ఎక్కువ మొత్తం డిపాజిట్‌‌‌‌‌‌‌‌ అయినట్లు గుర్తించిన అధికారులు ఆయా ఖాతాల్ని ఫ్రీజ్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిందిగా బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు.  ఏసీబీ రిపోర్ట్​ఆధారంగా సంబంధిత అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.