
రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు రూ.3 వేల నగదు స్వాధీనం
మెట్పల్లి టౌన్, వెలుగు: ఓ వైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖలో చోటుచేసుకుంటున్న అవినీతిపై దృష్టి సారించి ప్రక్షాళనకు ప్రయత్నాలు చేస్తుండగా… మరోవైపు క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగుల ఆగడాలు ఆగడం లేదు. సోమవారం ఓ రైతుకు పట్టదారు పాస్‌పుస్తకం, పేరు మార్పిడి చేయడానికి లంచం డిమాండ్ చేసిన మెట్పల్లి వీఆర్ఓ బాపయ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో రూ. 3 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకుని ఆరెస్టు చేశారు.
కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం…. మెట్పల్లి మండలంలోని బండలింగాపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ అనే రైతు ఇటీవల తన తండ్రి భాషా గిఫ్ట్ డీడ్‌గా అందించిన రాజేశ్వర్రావుపేట శివారులోని సర్వే నంబర్ 67/ఇ లో గల 23 గుంటల స్థలాన్ని పేరు మార్పిడి చేయాల్సిందిగా కోరుతూ స్థానిక మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. 2019 ఏప్రిల్ 16వ తేదీన పేరు మార్పిడి, పట్టదారు పాస్ పుస్తకం కోసం మీ సేవ ద్వారా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసి ఎదురు చూస్తున్నాడు.
గత కొన్ని రోజులుగా మెట్పల్లి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికి వీఆర్ఓ బాపయ్య నిర్లక్ష్యం వహిస్తూ పని పూర్తి చేయడం లేదు. రూ.5 వేలు లంచం ఇస్తే గాని పేరు మార్పిడి, పట్టాదారు పుస్తకం జారీ చేయమని వీఆర్ఓ బాపయ్య చెప్పాడు. అంత డబ్బులు ఇచ్చుకోలేనని మహ్మద్ ప్రాధేయపడడంతో కనీసం రూ.3 వేలు ఇవ్వాలని వీఆర్ఓ బాపయ్య డిమాండ్ చేశారు. దీంతో 2019 మే 31వ తేదీన మహ్మద్ కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో పథకం ప్రకారం సోమవారం మెట్పల్లి తహాసీల్దార్ కార్యాలయంలోని వీఆర్ఓలకు కేటాయించిన ప్రత్యేక గదిలో వీఆర్ఓ బాపయ్యకు మహ్మద్ రూ.3 వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. బాపయ్యను పూర్తి స్థాయిలో విచారించి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నటు డీఎస్పీ వివరించారు. ఏసీబీ సీఐలు రాము, సంజీవ్, వేణుగోపాల్‌లు ఉన్నారు.