జమ్మికుంట ఎమ్మార్వో ఇంట్లో ఏసీబీ సోదాలు

జమ్మికుంట ఎమ్మార్వో ఇంట్లో ఏసీబీ సోదాలు
  •  ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తనిఖీలు
  • రూ.20 కోట్ల విలువైన ప్రాపర్టీ గుర్తింపు

హనుమకొండ/కరీంనగర్/హనుమకొండ సిటీ, వెలుగు: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎమ్మార్వోగా పని చేస్తున్న రజనీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బుధవారం ఉదయం హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలోని రజనీ ఇంటితో పాటు ఆమె గతంలో ఎమ్మార్వోగా పని చేసిన ధర్మసాగర్ మండలంలో కూడా తనిఖీలు చేపట్టారు. ధర్మసాగర్ మండలంలో బడా రియల్టర్ గా పేరున్న జహంగీర్ (ఛోటు) నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఎమ్మార్వోగా రజనీ ఇక్కడ పని చేసిన టైమ్​లో జహంగీర్​ పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు చేయించినట్లు ఆరోపణలున్నాయి. 

అందులో చాలా వరకు లిటిగేషన్ ల్యాండ్స్ ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోనే ఆయన వాసంలోనూ సోదాలు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఆరు చోట్ల కరీంనగర్ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా, సోదాలు చేసేందుకు వెళ్తున్న ఏసీబీ అధికారుల కారు ప్రమాదానికి గురైంది. 

భూమి పత్రాలు స్వాధీనం

రజనీ ఆస్తి విలువ రూ.3.20 కోట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్​లో వీటి విలువ రూ.20 కోట్లపైనే ఉంటుందని తెలిసింది. వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.55లక్షల విలువైన 7 ఎకరాల భూమికి సంబంధించిన ప్రతాలు, రూ.21లక్షల విలువైన 22 ఓపెన్ ప్లాట్ల డాక్యుమెంట్లను గుర్తించారు. రూ.50లక్షల విలువైన మరో మూడు ఆస్తుల కొనుగోలు కోసం అడ్వాన్స్ చెల్లించి రాసుకున్న అగ్రిమెంట్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.1.51 లక్షల నగదు, రూ.10.27 లక్షల విలువైన 1,462.5 గ్రాముల బంగారం, రూ.31లక్షల విలువైన వెహికల్స్ గుర్తించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆస్తులు సుమారు రూ.3.20కోట్లు ఉంటుందని వెల్లడించారు. రజనీపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు వివరించారు.