ఏసీబీ వలలో ఎస్సై, హోంగార్డు

ఏసీబీ వలలో ఎస్సై, హోంగార్డు

కాగజ్ నగర్, వెలుగు : వివాహిత అదృశ్యం కేసులో వ్యక్తిని తప్పించేందుకు బాధితుని నుంచి లంచం తీసుకుంటూ ఎస్సై, హోంగార్డు ఏసీబీకి చిక్కారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌  జిల్లా చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన ఓ వివాహిత కుటుంబ గొడవలతో గత నెల అక్టోబర్  2న ఇంటి నుంచి మహారాష్ట్రలోని అహెరికి వెళ్లిపోయింది. 

అదేనెల  4న తిరిగి ఇంటికి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు మహిళ కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. వివాహిత మిస్సింగ్ కు  సహకరించాడని గ్రామానికి చెందిన డోకె ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనకు రూ.70 వేలు ఇస్తే ఈ కేసు నుంచి తప్పిస్తానని ప్రశాంత్ కు ఎస్సై వెంకటేశ్  చెప్పాడు. డబ్బులు ఇవ్వకపోతే జైలుకు పంపుతానని బెదిరించాడు. తాను రూ.20 వేలు ఇస్తానని చెప్పడంతో ఎస్సై ఒప్పుకున్నాడు. 

అయితే ప్రశాంత్  ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం స్టేషన్ లో ఎస్ఐ కి డబ్బులు ఇచ్చేందుకు ముందుగానే ఏసీబీ అధికారులు ప్లాన్  చేశారు. శుక్రవారం డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఎస్సై వెంకటేశ్.. హోంగార్డ్ జనార్దన్ ను  ప్రశాంత్ బంధువు ఇంటికి పంపాడు. అక్కడ డ్రైవర్  జనార్దన్.. ప్రశాంత్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్డుకున్నారు. హోంగార్డ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై, హోంగార్డుపై కేసు నమోదు చేసి కరీంనగర్  ఏసీబీ కోర్టులో రిమాండ్ కు తరలించారు.