ఏసీబీ వలలో ముగ్గురు ఉద్యోగులు

ఏసీబీ వలలో ముగ్గురు ఉద్యోగులు

మంచిర్యాల/వికారాబాద్/పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం లంచం తీసుకుంటూ ముగ్గురు అవినీతి ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడిన వారిని ఏసీబీ ఆఫీసర్లు అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపించారు. వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా కోటపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో జూనియర్  అసిస్టెంట్ గా పని చేస్తున్న గడియారం శ్రీనివాస్  అదే డిపార్ట్​మెంట్​లో పని చేసిన ఓ రిటైర్డ్  ఆఫీసర్  నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఆదిలాబాద్  ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం... తోట వెంకటేశ్వర్లు కోటపల్లి పీహెచ్ సీలో కమ్యూనిటీ హెల్త్  ఆఫీసర్ గా పని చేస్తూ ఇటీవల రిటైర్  అయ్యారు. 

రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించిన ఫైల్  తయారు చేయడం కోసం జూనియర్  అసిస్టెంట్  శ్రీనివాస్ రూ.6 వేలు లంచం డిమాండ్  చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి, వారి సూచనల మేరకు నస్పూర్ లోని ఓ హోటల్లో డబ్బులు ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని కరీంనగర్ లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. శ్రీనివాస్  రెగ్యులర్  పోస్టింగ్  చెన్నూర్  మండలం అంగ్రాజ్ పల్లి పీహెచ్ సీ కాగా... డిప్యూటేషన్ పై కోటపల్లిలో పని చేస్తున్నాడు.

వికారాబాద్​లో సెక్షన్​ క్లర్క్..​

రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ వికారాబాద్  కలెక్టరేట్​లో పని చేసే సెక్షన్​ క్లర్క్​ ఏసీబీకి పట్టుబడ్డారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్  తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం వట్టి మీనపల్లి గ్రామానికి చెందిన ఒక రైతుకు రెండెకరాల అసైన్డ్​ భూమి ఉంది. కొందరు వ్యక్తులు పట్టా భూమి అంటూ కబ్జా చేశారు. దీనిపై తహసీల్దార్ కు ఫిర్యాదు చేయగా, ఆ ఫైల్​ను కలెక్టరేట్​కు పంపించారు. 

ఆ ఫైల్ ను కలెక్టర్  ముందు పెట్టేందుకు కలెక్టరేట్​లోని సెక్షన్  క్లర్క్​ సుజాత రూ.5 వేలు లంచం అడగగా ఫోన్ పే ద్వారా పంపించాడు. ఆ ఫైల్ ను తిరిగి నవాబుపేట తహసీల్దార్  ఆఫీస్ కు పంపేందుకు మరో రూ.20 వేలు డిమాండ్  చేసింది. రూ.15 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం డబ్బులు ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సుజాతను అరెస్ట్  చేసి రిమాండ్ కు పంపిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.

రూ.10 వేలు తీసుకుంటూ సర్వేయర్..

రూ.10 వేలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి తహసీల్దార్​ ఆఫీస్​లో పని చేసే సర్వేయర్​ ఏసీబీకి పట్టుబడ్డాడు. పెద్దపల్లికి చెందిన ఓ రైతు భూమిని సర్వే  కోసం సర్వేయర్​ సునీల్​ డబ్బులు డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సర్వేయర్​కు మంగళవారం రూ.10 వేలు ఫోన్​పే చేస్తానని చెప్పాడు. దానికి సర్వేయర్  అంగీకరించి, ఆ డబ్బులను తన అనుచరుడు రాజేందర్​కు  ఫోన్​పే చేయాలన్నాడు. 

డబ్బులను ఫోన్​పే చేసిన వెంటనే ఏసీబీ అధికారులు సునీల్​తో పాటు అతడి అనుచరుడు రాజేందర్​ను పట్టుకున్నారు. విచారణ అనంతరం వారిని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ విజయ్​కుమార్​ తెలిపారు.