
హైదరాబాద్, వెలుగు:కరెంట్ వెనుక కేసీఆర్ అబద్ధపు చీకట్లున్నాయని కాంగ్రెస్ అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. రాష్ట్రంలో 12 వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి జరుగుతున్నదని, ఇందులో కేసీఆర్ సర్కార్ స్థాపించిన ప్లాంట్ల విద్యుత్ ఉత్పత్తి ఎన్ని మెగావాట్లని ప్రశ్నించారు. పాల్వంచ కేటీపీఎస్ ఏడో దశ 800 మెగావాట్లు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 1080 మెగావాట్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఉందని అన్నారు.
ఇది మొత్తంగా 1880 మెగావాట్లే అని విమర్శించారు. కేటీపీఎస్ ఏడో దశ నిర్మాణంలో అవినీతికి పాల్పడి నాసిరకంగా కట్టారని, దీంతో అది స్టార్ట్ చేశాక 9 నెలల్లోనే ఐదు సార్లు షట్‌డౌన్ అయిందన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ శాఖపై వైట్‌పేపర్ రిలీజ్ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘దీపం వెలుతురులో చదువుకున్నామంటూ జగదీశ్ రెడ్డి అంటున్నారు. ఇంకా నయం శ్మశానంలో చితిమంటల వెలుగుల్లో చదువుకున్నామని అనలేదు. ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ కాంతులున్నాయంటే అందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వ కృషి ఉంది’’ అని అన్నారు.
శ్రీశైలం ప్రమాదానికి ఓ రిటైర్డ్ సీఈ కారణం!
శ్రీశైలం ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించలేదని వంశీ కృష్ణ ప్రశ్నించారు. ఆ ప్రమాదానికి ఓ రిటైర్డ్ సీఈ కారణమని ఆరోపించారు. పవర్ ప్లాంట్‌లో టర్బైన్లకు సంబంధించి ఏడాది రెండేండ్లకోసారి బ్యాటరీని మార్చాల్సి ఉంటుందని, కానీ, ఆ రిటైర్డ్ సీఈ అనుచరులకు చెందిన సంస్థకు బ్యాటరీలను మార్చే పనిని ఇప్పించారన్నారు. మోటార్లను ఆపి బ్యాటరీలను పెట్టాల్సి ఉంటుంది. కానీ, రన్నింగ్‌లో ఉండగానే వాళ్లు బ్యాటరీలను పెట్టడంతో కరెంట్ రివర్స్‌లో పాస్ అయి మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించిందన్నారు. దీని ప్రస్తుత ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని కోరారు. రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా కరెంటు చార్జీలు పెంచేసి గత ప్రభుత్వం ప్రజలను దోచుకుందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో ఉద్యోగులు బాగా పనిచేశారని, అలాంటి ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వాల్సింది పోయి డిమోషన్ ఇచ్చారన్నారు.150 మంది ఉద్యోగులను డిమోట్చేశారన్నారు. వాళ్లందరికీ ప్రస్తుత ప్రభుత్వం ప్రమోషన్ ఇవ్వాలని కోరారు.
ఆ ఊరికి రెండేండ్లుగా కరెంట్ లేదు
చుట్టూ అడవి మధ్యలో ఉండే నాగర్‌కర్నూల్ జిల్లాలోని వటువర్లపల్లె అనే గ్రామానికి రెండేండ్లుగా కరెంట్ రావడం లేదని, బీఆర్ఎస్హయాంలో అసలు పట్టించుకోలేదని వంశీకృష్ణ మండిపడ్డారు. 2001లో మూడు కేబుల్స్‌తో ఆ ఊరికి కరెంట్ సరఫరాను ప్రారంభించారని, 2005లో సమస్య రావడంతో ఒక కేబుల్‌తో సరఫరా జరిగిందని, కానీ, బీఆర్ఎస్ హయాంలో రెండేండ్ల నుంచి ఆ ఊరికి కరెంట్ రావడం లేదని అన్నారు.