శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. రూ.200 కోట్లు దాటిన ఆలయ ఆదాయం

శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. రూ.200 కోట్లు దాటిన ఆలయ ఆదాయం

కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఒక్క ఆదివారం రోజే సుమారు లక్షా 20 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ట్రావన్‌కోర్‌ దేవస్థానం మండలి తెలిపింది.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్​లో రూ.204 కోట్లు దాటిందని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. మండల పూజ కోసం ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటినుంచి డిసెంబర్​ 25 వరకు (39 రోజుల్లో) రూ.204.30 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు టీడీబీ అధ్యక్షుడు పీఎస్​ ప్రశాంత్​చెప్పారు.

డిసెంబర్​27 (బుధవారం)తో వార్షిక మండల పూజ సీజన్​ముగియనుంది. మిగిలిన రెండు రోజుల్లో వచ్చే కానుకలను కూడా కలిపితే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు సభ్యులు తెలిపారు.

శబరిమల యాత్రకు వచ్చే భక్తులు సమర్పించిన రూ.204.30 కోట్ల ఆదాయంలో రూ.63.89 కోట్లు భక్తులు నగదు రూపంలో హుండీలో సమర్పించారు. రూ.96.32 కోట్లు మహాప్రసాదం 'అరవణ ప్రసాదం' విక్రయాల ద్వారా వచ్చాయి. భక్తులకు విక్రయించే ఇంకో తీపి ప్రసాదం 'అప్పం' అమ్మకాల ద్వారా మరో రూ.12.38 కోట్లు సమకూరాయని అధ్యక్షుడు పీఎస్​ ప్రశాంత్​ ప్రకటించారు. 

మరోవైపు.. భక్తుల రద్దీ ఎక్కుగా ఉన్నప్పటికీ.. టీడీబీ తన పరిమితికి మించి ఏర్పాట్లు చేసినట్లు ప్రశాంత్‌ తెలిపారు. డిసెంబరు 25 వరకు ఏడు లక్షల మంది భక్తులకు అన్నదాన సత్రంలో ఉచితంగా ఆహారం అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది శబరిమల దర్శనం మండల మకరవిళక్కు వేడుకలతో నవంబర్‌ 17 నుంచి ప్రారంభమైంది. రెండు నెలలపాటు కొనసాగే ఈ మహాదర్శనం డిసెంబరు 27న మండల పూజతో ముగుస్తుంది. అనంతరం రెండు రోజుల పాటు గుడిని మూసి ఉంచుతారు. తిరిగి డిసెంబరు 30న గుడి తలుపులు తెరుచుకుంటాయి.