NCRB రిపోర్ట్: తెలంగాణలో 12 శాతం పెరిగిన క్రైం రేట్

NCRB రిపోర్ట్: తెలంగాణలో 12 శాతం పెరిగిన క్రైం రేట్

తెలంగాణలో నేరాలు పెరుగుతున్నాయి. 2019తో పోలిస్తే 2020లో రాష్ట్రంలో 12శాతం నేరాలు పెరిగినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తెలిపింది. 2020 లో జరిగిన నేరాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే తెలంగాణలో క్రైం రేటు 12శాతం పెరిగినట్లు తెలిపింది. 2020లో రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షా 47 వేల 501 నేరాలు జరిగాయి. 2019లో వీటి సంఖ్య 1 లక్షా 31 వేల 254లుగా ఉంది. 

NCRB క్రైం ఇన్ ఇండియా 2020 నివేదిక ప్రకారం తెలంగాణలో 827మంది హత్యల్లో చనిపోయారు. ప్రతి లక్ష మందిలో ఇద్దరి హత్య జరుగుతోంది.ఈ నివేదిక ప్రకారం ప్రతి లక్ష మందికి 393 కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది నిర్లక్ష్యం కారణంగా 7 వేల 564 మంది చనిపోయారు. రోడ్డు ప్రమాదాల్లో 7 వేల 226 మంది మరణించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో 13వందల 65 మంది చనిపోయారు. బాలికలపై లైంగిక వేధింపులకు సంబందించిన పోక్స్ కేసులు 2వేల 74 రికార్డయ్యాయి. 2020 లో రాష్ట్రంలో ఐదుగురు మహిళలపై యాసిడ్  దాడి జరిగింది. 
స్టేట్ లో 12 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. సోషల్  మీడియాలో తప్పుడు వార్తల ప్రచారం, వదంతులపై 273 కేసులు రిజిస్టర్  అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద 117 కేసులు, గ్యాబ్లింగ్ కు సంబంధించి 2,643 కేసులు బుక్  అయ్యాయి. కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించి  1,498 కేసులు నమోదు అయ్యాయి.  హైదరాబాద్ లో రోజురోజుకి క్రైం రేటు పెరిగిపోతోంది. 2020లో 15వేల 978, 2019లో 15,333 నేరాలు  జరిగినట్టు NCRB నివేదిక తెలిపింది.

కరోనా టైంలోనూ రాష్ట్రంలో 12శాతం క్రైం రేటు పెరగడం ఆందోళనగా ఉందన్నారు రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్న. పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండటంతో పాటు ప్రస్తుతం డ్యూటీలో ఉన్న పోలీసులను ఎక్కువగా  బందోబస్తులకు వాడుకోవడంతో... కేసుల విచారణ ఆలస్యం అవుతున్నాయి. నేరం జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ సరిగా జరక్కపోవడంతో కోర్టులో టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ నిరూపించలేకపోవడంతో శిక్షలు పడటం లేదన్నారు రెడ్డన్న. పోక్స్ కేసుల్లోనూ నిందితులకు సరైన శిక్షలు పడకపోవడంతో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు సరైన టైమ్ లో కఠిన శిక్షలు వేయించాలన్నారు. అప్పుడే క్రైం చేయడానికి ఎవరైనా భయపడతారని చెబుతున్నారు రిటైర్డ్ పోలీస్ అధికారులు. నేరాలు, శిక్షలపైనా జనానికి అవగాహన కల్పించాలంటున్నారు.