వెలుగు, ప్రజాపక్షం పేపర్లకు అక్రిడిటేషన్లు ఇవ్వాల్సిందే

వెలుగు, ప్రజాపక్షం పేపర్లకు అక్రిడిటేషన్లు ఇవ్వాల్సిందే

రాష్ట్ర సర్కారుకు ప్రెస్ ​కౌన్సిల్​ ఆదేశం
ప్రభుత్వ ప్రకటనల ఎంప్యానల్ లోనూ చేర్చండి
వచ్చే నెల తొలివారంలోగా ప్రక్రియ పూర్తి చేయండి
ఉత్తర్వులు జారీ చేసిన చైర్మన్​ జస్టిస్​ సి.కె.ప్రసాద్
రాష్ట్ర సర్కారుకు ప్రెస్​కౌన్సిల్​ ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగుప్రజాపక్షం, ప్రభాత వెలుగు న్యూస్​ పేపర్లకు అక్రిడిటేషన్లు జారీ చేయాలని, వాటిని ప్రభుత్వ ప్రకటనల ఎంప్యానల్ లో చేర్చాలని ప్రెస్ కౌన్సిల్  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి తొలివారంలోపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రెస్​ కౌన్సిల్​ చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్  ప్రసాద్ (సి.కె.ప్రసాద్) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభాత వెలుగు, ప్రజాపక్షం పత్రికలపై సమాచార శాఖ కమిషనర్​ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అన్ని అర్హతలున్నా కూడా అక్రిడిటేషన్లు, ఎంప్యానెల్​ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ  ప్రెస్​కౌన్సిల్​కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దానిపై సోమవారం జరిగిన విచారణకు హాజరైన అధికారులు తగిన వివరాలేవీ చెప్పకపోవడంపై ప్రెస్​కౌన్సిల్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించి.. మంగళవారం విచారణ కొనసాగించింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్  డైరెక్టర్ జగన్, మరికొందరు అధికారులు  ప్రెస్​కౌన్సిల్​ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాత వెలుగు, ప్రజాపక్షం పేపర్ల తరఫున సీనియర్​ జర్నలిస్టు, ప్రెస్​కౌన్సిల్​ మాజీ మెంబర్​ అమర్నాథ్​  వాదన వినిపించారు. సమాచార శాఖ ఉద్దేశపూర్వకంగానే ఈ రెండు పత్రికలకు అక్రిడిటేషన్లు నిలిపివేసిందని, ప్రభుత్వ ప్రకటనల ఎంప్యానల్ లో చేర్చలేదని చెప్పారు. అక్రిడిటేషన్ల జారీకి సంబంధించిన 239 జీవో, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అక్రిడిటేషన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానాలను వివరించారు.

ఎందుకివ్వలేదు?

పిటిషనర్ల వాదన విన్న ప్రెస్​కౌన్సిల్.. సమాచార శాఖ అధికారులపై  ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ నిబంధనలను అనుసరించి అక్రిడిటేషన్లు, ఎంప్యానల్ ను నిలిపివేశారని నిలదీసింది. అక్రిడిటేషన్ కమిటీలో ప్రెస్ కౌన్సిల్ సభ్యులను ఎందుకు చేర్చలేదని చైర్మన్ సి.కె.ప్రసాద్ అడిగారు. ఇక ముందు ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిని రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీలో చేర్చాలని ఆదేశించారు. ప్రభాత వెలుగు, ప్రజాపక్షం పత్రికలను పరిశీలించిన ఆయన.. బాగున్నాయని, పాఠకులను ఆకర్షించేలా ఉన్నాయని చెప్పారు. ఇలాంటి పత్రికలకు దక్కాల్సిన హక్కులను ఎందుకు నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సమాచార శాఖ జాయింట్​ డైరెక్టర్​ జగన్.. ఈ రెండు పత్రికలకు త్వరలోనే అక్రిడిటేషన్లు జారీ చేస్తామని, ఎంప్యానల్​లో చోటు కల్పిస్తామని ప్రెస్​ కౌన్సిల్​కు చెప్పారు. అయితే ఫిబ్రవరి మొదటి వారంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కౌన్సిల్ ఆదేశించింది.

ఇబ్బంది పెడ్తున్నరు

అన్ని అర్హతలు ఉన్నా అధికారులు తమను ఇబ్బంది పెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని అమర్నాథ్​ ప్రెస్​ కౌన్సిల్​కు విజ్ఞప్తి చేశారు. పెద్ద పత్రికలకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. చిన్న, మధ్యతరహా పత్రికలను అధికారులు ఎంతలా ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అయితే ప్రభుత్వం ఇబ్బంది పెడితే ఏ పత్రికలైనా ప్రెస్​ కౌన్సిల్​ను ఆశ్రయించవచ్చని చైర్మన్ సి.కె.ప్రసాద్ చెప్పారు. వాటికి సంబంధించి ఒక జాబితాను రూపొందించాలని, వాటిపైనా విచారణ జరుపుతామని పిటిషనర్లకు హామీ ఇచ్చారు. ఈ విచారణలో ప్రజాపక్షం ఎడిటర్  కె.శ్రీనివాస్ రెడ్డి, విరాహత్​అలీ, ప్రెస్​ కౌన్సిల్​ సభ్యుడిగా దేవులపల్లి అమర్  కూడా పాల్గొన్నారు.

అధికారుల తీరు మారాలి

ప్రెస్ కౌన్సిల్ వేసిన మొట్టికాయలతో అయినా అధికారుల తీరు మారాలని సీనియర్  జర్నలిస్టు అమర్నాథ్​ అన్నారు. ఇప్పటికైనా అన్ని పత్రికలను సమానంగా చూస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రెస్​ కౌన్సిల్​ ఇచ్చిన ఆదేశాలపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. న్యాయ పోరాటంలో టీయూడబ్ల్యూజే విజయం సాధించిందని పేర్కొన్నారు.

పత్రికలు ప్రజాగొంతుకలు

ప్రజా గొంతుకలుగా పత్రికలు పనిచేస్తున్నాయని సీనియర్ జర్నలిస్టు, ప్రజాపక్షం పత్రిక ఎడిటర్ కె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైనా వాస్తవాలను ప్రచురిస్తున్నామని చెప్పారు. సమాచార శాఖ అధికారులు రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పత్రికల గొంతు నొక్కుతున్నాయని ప్రెస్​ కౌన్సిల్ కు చెప్పారు. జర్నలిస్టులు, పత్రికల స్వేచ్ఛ, సంస్థల విషయంలో ఎప్పుడూ కలిసి పోరాడేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

న్యాయ పోరాటంలో గెలిచినం

ప్రజా గొంతుకలైన ప్రభాత వెలుగు, ప్రజాపక్షం పత్రికలను అణచివేసేందుకు సమాచార శాఖ ఉన్నతాధికారి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, న్యాయ పోరాటంలో తమ సంఘం గెలిచిందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ చెప్పారు. ప్రెస్ కౌన్సిల్ ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. మీడియా సంస్థలు, వాటిల్లోని ఉద్యోగులకు అన్యాయం జరిగితే పోరాడుతామన్నారు.

see also: ఓటేస్త..నాకేంటి? : డిమాండ్​ చేసి మరీ పైసలు