- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.అన్వేష్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ తో కలిసి ఆయన సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు.
సాయంత్రం 5 గంటలకు గేటు మూసివేయాలని, గేటు లోపల ఉన్నవారికి టోకెన్లు అందజేసి వరుస క్రమంలో నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నామినేషన్ దరఖాస్తులు పూర్తి చేసిన అభ్యర్థులు హెల్ప్ డెస్క్ వద్ద పరిశీలించుకుని సరైన నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.
సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
నస్పూర్, వెలుగు : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో ఏర్పాటు చేసిన 265 పోలింగ్ కేంద్రాలకు 265 మంది పీవోలతోపాటు ఏపీవోలను రాండమైజేషన్ చేశామని తెలిపారు. బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలకు ర్యాండమైజేషన్ పూర్తిచేశామన్నారు.
