పోలీసులకు కంప్లయింట్ చేసిందని కక్ష పెంచుకున్నడు

పోలీసులకు కంప్లయింట్ చేసిందని కక్ష పెంచుకున్నడు

గచ్చిబౌలి, వెలుగు: గర్భిణి హత్య కేసులో నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పేరుపాలెం గ్రామానికి చెందిన కావూరు శ్రీరామక్రిష్ణ(35)కు, అదే ప్రాంతానికి చెందిన ఐటీ ఎంప్లాయ్ లక్ష్మి ప్రసన్నతో 2020లో పెళ్లైంది. వీరి పెండ్లికి ఇరు కుటుంబాలకు బంధువైన కొండాపూర్​ ఉండే వెంకటరామ మధ్యవర్తిగా వ్యవహరించాడు. కొన్నిరోజుల తర్వాత శ్రీరామకృష్ణ, లక్ష్మీప్రసన్న మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అదనపు కట్నం కోసం శ్రీరామకృష్ణ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఏడాది కిందట పేరుపాలెంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా.. మధ్యవర్తిగా వ్యవహరించిన వెంకటరామ, అతడి కుటుంబీకులు లక్ష్మీ ప్రసన్న తరఫున అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా శ్రీరామకృష్ణ గొడవ పెట్టుకోవడంతో ఏ నిర్ణయం తీసుకోకుండానే పంచాయితీ ముగిసింది. అప్పటి నుంచి లక్ష్మీ ప్రసన్న తన తల్లితో కలిసి సిటీలో ఉంటోంది. తర్వాత ఆమె తన భర్త శ్రీరామకృష్ణ, అతడి కుటుంబసభ్యులపై చందానగర్ పీఎస్​లో కంప్లయింట్ చేసింది. వెంకటరామ మద్దతుతోనే తన భార్య పోలీసులకు కంప్లయింట్ చేసిందని అతడిపై శ్రీరామకృష్ణ కక్ష పెంచుకున్నాడు. అతడిని హత్య చేయాలని స్కెచ్ వేశాడు.

ఇందుకోసం నెలరోజుల కిందట హఫీజ్ పేటలో ఓ రూమ్ రెంట్​కు​ తీసుకుని అక్కడే ఉన్నాడు. ఈ నెల 6న సాయంత్రం 4 గంటలకు వెంకటరామ తన కుమార్తెను స్కూల్ నుంచి తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఇంట్లో అతడి భార్య, 8 నెలల గర్భిణి అయిన వాసంశెట్టి స్రవంతి(32) ఒంటరిగా ఉంది. అదే టైమ్​లో శ్రీరామకృష్ణ అక్కడికి వచ్చాడు. వెంకటరామ లేకపోవడంతో స్రవంతితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కొడవలితో ఆమె  మెడపై నరికి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ స్రవంతిని స్థానికులు హాస్పిటల్ కు తరలించగా.. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆమె చనిపోయింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు పరారీలో ఉన్న శ్రీరామకృష్ణను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.