దళిత రైతుపై దాడి కేసులో..  నిందితుడికి రిమాండ్​

దళిత రైతుపై దాడి కేసులో..  నిందితుడికి రిమాండ్​

చెన్నూర్, వెలుగు:  మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం శెట్​పల్లిలో దళిత రైతు దుర్గం బాపు(40)ను కొయ్యకు కట్టేసిన ఘటనలో అదే గ్రామానికి చెందిన సూరం రాంరెడ్డి(50) పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు.. శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. గురువారం మధ్యాహ్నం దుర్గం బాపు ఎడ్లు తన పొలంలో పడ్డాయని వాటిని రాంరెడ్డి తన ఇంటి దగ్గర కట్టేసుకున్నాడు.

రాంరెడ్డి లేని టైమ్​లో బాపు వెళ్లి ఎడ్లను విడిపించుకొచ్చాడు. దీంతో రాంరెడ్డి సాయంత్రం బాపును ఈడ్చుకొచ్చి తన ఇంటి ముందు కొయ్యకు కట్టేసి కొట్టాడు. గ్రామస్తులు జోక్యం చేసుకొని బాపును విడిపించారు. బాధితుడు వెంటనే కోటపల్లి పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్​ చేశాడు. దీంతో రాంరెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రామగుండం పోలీస్​ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశాలతో శుక్రవారం జైపూర్​ఏసీపీ మోహన్​ శెట్​పల్లికి వెళ్లి ఎంక్వయిరీ చేశారు. ప్రత్యక్ష సాక్షులను విచారించారు. రాంరెడ్డిని అరెస్టు చేసి జ్యుడీషియల్ ​రిమాండ్​కు తరలించారు.