పోక్సో కేసులో నిందితుడికి రెండు జీవిత ఖైదులు..నల్గొండ అడిషనల్‌‌ డిస్ట్రిక్ట్‌‌ కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో నిందితుడికి రెండు జీవిత ఖైదులు..నల్గొండ అడిషనల్‌‌ డిస్ట్రిక్ట్‌‌ కోర్టు సంచలన తీర్పు

నల్గొండ అర్బన్, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి రెండు జీవిత ఖైదులతో పాటు జరిమానా విధిస్తూ నల్గొండ అడిషనల్‌‌ డిస్ట్రిక్ట్‌‌ కోర్టు జడ్జి రోజా రమణి శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చారు. ఎస్పీ శరత్‌‌ చంద్ర పవార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్‌‌ గ్రామానికి చెందిన కట్టెల సైదులు 2019లో తన బంధువు అయిన చిట్యాలకు చెందిన ఓ బాలికపై అత్యాచారం చేశాడు. 

ఆ అవమానం భరించలేక బాలిక కిరోసిన్‌‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 2019 జూన్ 13న చిట్యాల పోలీస్‌‌స్టేషన్‌‌లో ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసు నమోదు అయింది. నేరం నిరూపణ కావడంతో సైదులుకు రెండు జీవిత ఖైదులతో పాటు రూ. 65 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం జడ్జి తీర్పు చెప్పారు. సరైన సాక్ష్యాధారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా పనిచేసిన పోలీసులను ఎస్పీ శరత్‌‌ చంద్రపవార్‌‌  అభినందించారు.