వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

 వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
  • ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్లు 

మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్లు సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల రోడ్డులో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు ఆధ్యాత్మికంగా, శాంతియుత మార్గంలో జరుపుకోవాలన్నారు. 

ఈ సందర్భంగా వారిని అంజనీ పుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం డైరెక్టర్లు, స్థానిక సీఐ, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు

నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

లక్సెట్టిపేటలో గోదావరి వద్ద నిమజ్జన ఏర్పాట్లను తహసీల్దార్ దిలీప్ కుమార్, సీఐ రమణమూర్తితో కలిసి ఏసీపీ ప్రకాశ్ పరిశీలించారు. నిమజ్జన ప్రదేశాల్లో భద్రత, రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నిమజ్జన ప్రదేశాలకు చిన్న పిల్లలను తీసుకురావద్దని ప్రజలకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఎస్సై గోపతి సురేశ్ తదితరులు ఉన్నారు.

600 మంది పోలీసులతో బందోబస్తు

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఆసిఫాబాద్​ఎస్పీ కాంతిలాల్ పాటిల్ చెప్పారు. జిల్లా కేంద్రంలోని పెద్ద వాగు వద్ద గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లను గురువారం  పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ..జిల్లాలో గణేశ్ నిమజ్జనం ఉత్సవాలు అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. నిమజ్జనం ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బోట్స్, రోప్స్, డీడీఆర్‌‌ఎఫ్ బృందం, ఈతగాళ్లను అందుబాటులో ఉంచనునట్లు చెప్పారు.