స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఏసీపీ రవికుమార్

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఏసీపీ రవికుమార్

కోల్​బెల్ట్, వెలుగు: రాబోయే లోక్​సభ ఎన్నికల్లో ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్​ సూచించారు. ఆదివారం ఎన్నికల నేపథ్యంలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలతో  కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మందమర్రి సీఐ శశీధర్​రెడ్డి, ఎస్సైలు రాజశేఖర్, ఆంజనేయులు, ప్రవీణ్​కుమార్, కేంద్ర బలగాలు, పోలీసులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్ : యువత మావోయిస్టులకు సహకరించి భవిష్యత్​ను నాశనం చేసుకోవద్దని ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య పేర్కొన్నారు. ఆదివారం వాంకిడి మండలంలోని వెల్గి, లక్ష్మీ పూర్ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సీఐ శ్రీనివాస్, ఎస్సై సాగర్, సీ ఆర్పీఎఫ్ బలగాలతో  గ్రామాలు సందర్శించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు  సంచరించే అవకాశం ఉందని,  అపరిచిత వ్యక్తుల మాయమాటలు నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని, 100 కి కాల్ చేసి  చెప్పాలని కోరారు. అందించిన వారివివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు. వ్యవసాయ పొలాల్లో పంటలకు రక్షణగా అటవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చవద్దని సూచించారు. 

గుడిహత్నూర్‌లో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌

గుడిహత్నూర్ : గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో ఆదివారం స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఊట్నూర్‌ డీఎస్పీ నాగేందర్‌ మాట్లాడుతూ త్వరలో జరుగబోయే పార్లమెంట్‌ఎన్నికలలో ప్రజలంతా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.  ఫ్లాగ్‌మార్చ్​లో ఇచ్చోడ సీఐ భీమేశ్, ఎస్సై ఇమ్రాన్‌ సయ్యద్, కేంద్ర సాయుధ బలగాల కమాండెంట్‌సాహూ, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు

భైంసా : త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీసుశాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా భైంసాలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడం, ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నగదు, బంగారం, మద్యం రవాణా పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ రాజారెడ్డి, ఎస్సైలు షరీఫ్, శివ, సీఆర్పీఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు ఉన్నారు.