ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం 370 ఎకరాల సేకరణ

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం 370 ఎకరాల సేకరణ

ఏండ్లుగా రైతులకు ఆ భూములే జీవనాధారం. అలాంటి భూములను ఫుడ్ ​ప్రాసెసింగ్​కోసమంటూ సర్కారు తీసుకోవడంతో వారి బతుకులు ఆగమయ్యాయి. భూములు ఇవ్వబోమని ఎంత మొత్తుకున్నా ఆఫీసర్లు వినిపించుకోలేదు. తక్కువ భూమి సేకరించిన రెండు గ్రామాల్లో ఎకరాకు రూ. 10 లక్షల వరకు పరిహారం ఇచ్చి.. ఎక్కువ భూమి సేకరించిన గ్రామంలో మాత్రం రూ. 5 లక్షలే ఇస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. నిర్వాసితులకు ఉపాధి చూపిస్తామన్న కేటీఆర్​హామీ నెరవేరకపోవడంతో రైతన్నలు కూలీలుగా మారారు. 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సర్కారు నర్మాల, దేశాయిపేట, లచ్చపేట గ్రామాల్లో 370 ఎకరాలు సేకరించింది. ఇందులో దేశాయిపేట, లచ్చపేటలో 60 ఎకరాలు, మిగతా భూమి నర్మాల రైతుల నుంచి తీసుకున్నారు. మూడేళ్ల క్రితం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించగా ఈ ఏడాదే పూర్తయ్యింది. ప్రభుత్వం తీసుకున్న భూముల్లో  దళితులవే ఎక్కువగా ఉన్నాయి.  అర ఎకరం, పది, ఇరవై  గుంటల భూమిని కోల్పోవడంతో పేద రైతుల బతుకుకు భరోసా లేకుండా పోయింది. తక్కువ భూమి ఉండడంతో చాలామంది రైతులకు ఇవ్వడం ఇష్టం లేకున్నా ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంది. భూమి తీసుకుంటే ఉపాధి కోల్పోతామని ఎంత మొత్తుకున్నా అధికారులు వినకుండా తీసుకున్నారంటూ ఈ ఏడాది జులైలో నర్మాల రైతులు ఆందోళన చేశారు. అయినప్పటికీ సర్కారు పట్టించుకోలేదు. మరోవైపు దళితుల ఆక్రమణలో ఉన్న వందెకరాల భూమిని సైతం ప్రభుత్వం లాక్కుంది. ఈ వందెకరాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు.

అక్కడ రూ. పది లక్షలు.. ఇక్కడ ఐదు లక్షలే..

నర్మాల గ్రామంలో భూముల ధర ఎకరాకు రూ. 20 లక్షలు పలుకుతున్నప్పటికీ సర్కారు మాత్రం రూ. 5 లక్షలు మాత్రమే పరిహారంగా ఇచ్చింది. చాలామంది రైతులకు చెక్కులు ముట్టినప్పటికీ వారి ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేయలేదని  వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం పంటలు పండే భూములకు రూ. 6.7 లక్షలు, పండని భూములకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం 161 మంది రైతులు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెబుతోంది. ఇంకా చాలామంది రైతులకు పరిహారం అందాల్సి ఉంది. భూమిలో ఉన్న బోరుబావులు, పశువుల పాకలు, చెట్లకు ఇప్పటివరకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. నర్మాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం సేకరించిన భూముల పరిహారంలో అధికార పార్టీ నాయకులు చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు వస్తున్నాయి. దేశాయిపేట, లచ్చపేట గ్రామాల్లో సేకరించిన 60 ఎకరాలకు రూ. 10.40 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారని, నర్మాల రైతులకు మాత్రం ఎకరాకు రూ. ఐదు లక్షల చొప్పున ఇవ్వడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములను త్యాగం చేసిన రైతులందరికీ సమానంగా పరిహారం ఇవ్వకుండా.. వేరువేరుగా ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. ఇదే విషయమై ఇప్పటికే పలుసార్లు గంభీరావుపేట తహసీల్దార్​ఆఫీస్, కలెక్టరేట్ కు వెళ్లి రైతులు మొరపెట్టుకున్నారు. 

ఆదుకుంటామని మరిచిపోయిండ్రు

నర్మాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం సేకరించిన భూమిని టీఎస్ఐఐసీకి అప్పగించారు. కానీ ఇంతవరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులు షురూ కాలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం భూములు త్యాగం చేసినవారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఉపాధి కల్పిస్తామని  మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఆరు నెలలు గడుస్తున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. మార్కెట్ రేట్ ప్రకారం కాకుండా అరకొర పరిహారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టప్రకారం రైతులకు పరిహారం ఇవ్వాలని లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.

కైకిలికి పోతున్న

మేం భూములివ్వబోమని మొత్తుకున్నా ఆఫీసర్లు వినకుండా గుంజుకున్నరు. ఉన్న ఎకరం భూమి  సర్కారోళ్లు తీసుకోవడంతో ఉపాధి లేక రోజూ కైకిలికి పోతున్న. రోజువారి కూలి చేసుకుని పొట్ట పోసుకుంటున్న. మాకిచ్చిన నష్టపరిహారం కూడా తక్కువే. భూముల రేట్లు పెరిగినయి అంటున్నరు.. కానీ పెరిగిన రేట్ల ప్రకారం మాకు కట్టియ్యలేదు. 
- మిద్దు కమలవ్వ, నర్మాల

ఉపాధి కల్పించాలి

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ప్రభుత్వం భూములు తీసుకోవడంతో ఉపాధి కోల్పోయాం. భూములు కోల్పోయినవారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మూడేండ్ల కిందట భూమి తీసుకున్న నిర్వాసితులకు సైతం ఇప్పటివరకు ఎటువంటి ఉపాధి చూపించలేదు. కేటీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
-  కర్రోల్ల రాజు, నర్మాల